
2021 చివర్లో వచ్చి బాక్సాఫీస్ దుమ్ము దులిపాడు బాలయ్య. కోవిడ్ సంక్షోభంతో బూజు పట్టిన థియేటర్స్ కి కొత్త శోభ తెచ్చాడు. చాలా కాలం తర్వాత అఖండ (Akhanda)థియేటర్స్ వద్ద జనాల సందడి కనిపించింది. ఇక బాలయ్య అభిమానుల సంబరాలకైతే హద్దేలేదు. ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చకున్న అఖండ బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అఖండ మూవీ దాదాపు రూ. 120 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది.
బాలయ్య (Balakrishna) గత చిత్రాలన్నీ ఘోర పరాజయం పొందాయి. గత ఐదేళ్లలో ఆయన మార్కెట్ బాగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో అఖండ థియరిటికల్ హక్కులు తక్కువ ధరకే అమ్ముడు పోయాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ భారీగా లాభాలు ఆర్జించారు. నిర్మాతతో పాటు బయ్యర్లకు అఖండ కాసుల వర్షం కురిపించింది. 2021లో అత్యధిక లాభాలు మిగిల్చిన చిత్రంగా నిలిచింది. పుష్ప, వకీల్ సాబ్ లాంటి చిత్రాలు భారీ వసూళ్లు సాధించినా లాభాల లెక్కలో అఖండ ముందు నిలిచింది.
అందులోనూ బాలయ్య కచ్చితంగా హిట్ కొట్టాల్సిన తరుణంలో అఖండ రూపంలో ఆయనకు గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చింది. కలిసొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అఖండ తెరకెక్కించారు. ముఖ్యంగా అఘోరాగా బాలయ్యను ఆయన వెండితెరపై చూపించిన తీరు ప్రసంశలు అందుకుంది. సింహా, లెజెండ్ హిట్స్ తర్వాత అఖండ మూవీతో హ్యాట్రిక్ విజయాలు పూర్తి చేశారు.
కాగా బుల్లితెరపై కూడా అఖండ సత్తా చాటింది. అఖండ మూవీ 13.31 టీఆర్పీ (Akhanda movie trp) అందుకుంది. శ్రీరామనవమి పురస్కరించుకొని ఏప్రిల్ 10న స్టార్ మాలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా అఖండ ప్రసారమైంది. ఇక బాలయ్య కెరీర్ లోనే అత్యధిక టీఆర్పీ అందుకున్న చిత్రం అఖండ కావడం విశేషం. ఇంకా ఎక్కువ టీఆర్పీ ఫ్యాన్స్ అంచనా వేశారు. 18-20 రేటింగ్స్ పాయింట్స్ అఖండ సాధిస్తుందని భావించారు. ఐపీఎల్ ఈవెంట్ అఖండ టీఆర్పీ పై ప్రతికూల ప్రభావం చూపింది.
ఇక తెలుగులో 29.4 టీఆర్పీతో అల వైకుంఠపురంలో మొదటి స్థానంలో ఉంది. మహేష్ సరిలేరు నీకెవ్వరూ 23.04, బాహుబలి 2 22. 7, శ్రీమంతుడు 22.54, దువ్వాడ జగన్నాధం 21.7 రేటింగ్స్ తో టాప్ ఫైవ్ స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం బాలయ్య దర్శకుడు గోపీచంద్ మలినేనితో మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. దసరా కానుకగా మూవీ విడుదల కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.