
ఎక్కడ చూసిన కెజిఎఫ్ పేరు మారు మోగిపోతోంది. కెజిఎఫ్ మొదటి భాగం సంచలన విజయం సాధించగా.. ఇటీవల విడుదలైన రెండవ భాగం ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా.. హోంబలే ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
ఈ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ కెజిఎఫ్ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మించారు. కెజిఎఫ్ అఖండ విజయం సాధించడంతో హోంబలే సంస్థ కూడా బాగా పాపులర్ అయింది. దీనితో ఈ సంస్థ తదుపరి చిత్రాలని ప్రేక్షకులు ఆసక్తిగా గమనించడం ఖాయం. తాజాగా హోంబలే సంస్థ అదిరిపోయే ప్రకటన చేసింది.
విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న 'ఆకాశం నీ హద్దురా' దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో హోంబలే సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించబోతోంది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కొద్దిసేపటి క్రితమే చేశారు. సుధా కొంగరతో మా తదుపరి చిత్రం ప్రకటిస్తున్నందుకు గర్వంగా ఉంది.
కొన్ని యదార్థ సంఘటనలని సరైన విధంగా, ఖచ్చితంగా చెప్పాలి.. నిజమైన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం ఉండబోతోంది. త్వరలో మరిన్ని వివరాలు ప్రకటిస్తాం అని తెలిపారు.
హీరో సూర్యతో సుధా కొంగర తెరకెక్కించిన ఆకాశం నీ హద్దురా చిత్రం ఐఎండిబి రికార్డు రేటింగ్ సొంతం చేసుకుంది. హాలీవుడ్ చిత్రాలని సైతం అధికమించింది. కెప్టెన్ గోపినాధ్ జీవిత చరిత్రని ఆమె అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పుడు ఆమె కేజిఎఫ్ నిర్మాణ సంస్థతో చేతులు కలపడం ఆసక్తిగా మారింది.