
తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన 'బాహుబలి' వసూళ్ళలో వెయ్యికోట్లను ఎప్పుడో పది రోజుల లోపే దాటేసింది. ఇద్ అప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డ్. అయితే ఇటీవలే బాలీవుడ్ సినిమా 'దంగల్' వెయ్యి కోట్ల మార్క్‌ని అందుకుంది. ఈ రెండూ ఇప్పుడు వసూళ్ళలో పోటీ పడ్తున్నాయి. చైనాలో 'దంగల్' విడుదలయ్యాక ఈక్వేషన్స్‌కి కొత్త ఉత్సాహమొచ్చింది. 'బాహుబలి' వేగం తగ్గలేదు. కానీ, 'దంగల్' దూకుడు ప్రదర్శిస్తోంది. అయినాసరే, ఇంకా 'దంగల్', 'బాహుబలి'తో పోల్చితే వెనకబడే వుంది. కానీ చైనాలో ఇదే జోరు కొనసాగితే 'బాహుబలి'ని 'దంగల్' దాటేయొచ్చేమో.. అని కూడా వాదనలు విన్పిస్తున్నాయి.
నిజానికి 'బాహుబలి' జేన్ర వేరు, 'దంగల్' జేనర్ వేరు. ఈ రెండు సినిమాలూ ఒకేసారి విడుదల కాలేదు. 'బాహుబలి'కి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కలిసొచ్చాయి. 'దంగల్'కీ ఇప్పుడవే పరిస్థితులు కలిసొస్తున్నాయి. ఓ తెలుగు సినిమా, బాలీవుడ్‌లోనూ విడుదలై, ఇండియన్ సినిమా వసూళ్ళలోనే సరికొత్త రికార్డులు అందుకుంది. 'దంగల్' హిందీ సినిమా. చాలా భాషల్లో విడుదలై, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
'బాహుబలి' బాలీవుడ్ రికార్డుల్ని తిరగరాసేసిందన్న ప్రచారం, బాలీవుడ్ జనాలకి అంతగా మింగుడు పడలేదు. అందుకే, ఇప్పుడు 'దంగల్' దూకుడు చూసి పండగ చేసుకుంటున్నారు. పండగ చేసుకుంటే ఫర్లేదు, 'బాహుబలి' పనైపోయిందంటూ, 'బాలీవుడ్' అభిమానులు అత్యుత్సాహం చూపుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చ 'బాహుబలి'కి మళ్ళీ కొత్త ఉత్సాహాన్నిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం 1400 కోట్లకు దగ్గర్లో వున్న బాహుబలి, ఒక్క హిందీ వెర్షన్‌తోనే 432 కోట్లు వసూలు చేసిందంటే ఇది ఆషామాషీ రికార్డ్ కాదు. ఏదేమైనా 'దంగల్'తో 'బాహుబలి'నో, 'బాహుబలి'తో 'దంగల్'నో పోల్చి చూడటం సరికాదు. రెండు సినిమాలూ భారతీయ సినిమా కీర్తి పతాకను రెపరెపలాడించినవే.