
దశాబ్దం కింద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా 'జల్సా' యుఎస్ బాక్సాఫీస్ వీకెండ్ కలెక్షన్లలో టాప్-10లో చోటు సంపాదించిందని సంబరపడ్డాం. ఆ తర్వాత చాలా సమయం పట్టింది. రెండేళ్ల కింద 'బాహుబలి: ది బిగినింగ్' అమెరికాలో అదిరిపోయే వీకెండ్ వసూళ్లతో అక్కడి బాక్సాఫీస్ పండిట్లను సైతం ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు 'బాహుబలి: ది కంక్లూజన్' అమెరికాలో సాగిస్తున్న కలెక్షన్ల ప్రభంజనం హాలీవుడ్ దర్శక నిర్మాతలను సైతం అబ్బురపరుస్తోందట.
ఈ వీకెండ్ అమెరికన్ బాక్సాఫీస్‌లో బాహుబలి స్థానం రెండు. అంటే హాలీవుడ్ సినిమాలను కూడా క్రాస్ చేస్తోంది. హాలీవుడ్ సూపర్ స్టార్లు నటించిన సూపర్ హిట్ ఫ్రాంఛైజీ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్'లో భాగంగా వచ్చిన కొత్త సినిమా తర్వాతి స్థానం 'బాహుబలి-2'దే కావడం విశేషం. ఈ వారాంతంలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-8 సినిమా 5.1 మిలియన్ డాలర్ల వసూళ్లతో బాక్సాఫీస్ చార్ట్‌లో అగ్రస్థానంలో నిలిస్తే.. 'బాహుబలి: ది కంక్లూజన్' 4.8 మిలియన్ డాలర్లతో దానికి అత్యంత చేరువగా రెండో స్థానంలో నిలవడం విశేషం. 'హౌ టు బి లాటిన్ లవర్' మూవీ 3.9 మిలియన్ డాలర్లతో మూడో స్థానం సాధించింది.
టామ్ హాంక్, ఎమ్మా వాట్సన్ లాంటి ప్రముఖ తారలు నటించిన 'సర్కిల్' సినిమా 3.2 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానానికి పరిమితం అయింది. స్వయంగా ఐఎండీబీ ఈ గణాంకాల్ని విడుదల చేయడం విశేషం. గత ఏడాది 'దంగల్' సినిమా అమెరికాలో ప్రకంపనలు రేపింది కానీ.. అది కూడా 'బాహుబలి-ది కన్ క్లూజన్' ముందు దిగదుడుపే. హాలీవుడ్ వాళ్లు సైతం ఇదేం సినిమా అని చూసేలా అమెరికాలో ప్రస్థుతం బాహుబలి-2 ప్రభంజనం సాగుతోంది.