
తమిళనాడు సీఎం జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్, విలక్షణ నటుడు కమల్ హాసన్ లు తమిళనాట రాజీకీయ ప్రవేశం చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. కమల్ హాసన్ ఏకంగా పార్టీ పెడతానని కూడా స్పష్టం చేశారు. ఇప్పుడు మరో సినీ తార వీరి జాబితాలో చేరారు.
సినీ నటి సుహాసిని మణిరత్నం కూడా రాజకీయాల్లో చేరతారంటూ వార్తలు ఊపందుకుంటున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి ప్రవేశించడానికి హీరోలకు మాత్రమే హక్కు ఉందా అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా తమిళనాడు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన జయలలిత కూడా ఒక మహిళేనని.. అయినప్పటికీ ఆమె తమిళ రాజకీయాల్లో అత్యతంత ప్రభావ శీల నాయకురాలిగా ఎదిగారని గుర్తు చేశారు.
రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతోనే సుహాసిని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారనే ప్రచారం కూడా మొదలైంది. ఇదిలా ఉంటే కమల్ హాసన్ తన 63వ పుట్టినరోజు(నవంబర్ 7)నాడు తన నూతన పార్టీ వివరాలను వెల్లడించనున్నారు.