
లెజెండరీ నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఆయన కుమారుడు బాలకృష్ణ ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్20 నుంచి ప్రారంభంకానుంది. దీంతో సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందే కాస్ట్ అండ్ క్రూను నియమించుకునే పనిలో తేజ బిజీగా ఉన్నాడు.
ఇప్పటి వరకు ఎన్టీఆర్ రోల్‌కు బాలకృష్ణ మాత్రమే ఎంపికయ్యాడు. దర్శకుడు తేజ ఓ వైపు స్క్రిఫ్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే మరో వైపు నటీనటుల అన్వేషణ చేస్తున్నారు. తాజాగా నేనే రాజు నేనే మంత్రి అనే పొలిటికల్ డ్రామాతో హిట్ కొట్టిన తేజ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడంతో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక సాంకేతిక నిపుణుల్లో ఒక్క కీరవాణి పేరు మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్‌గా వినిపిస్తోంది.
ఇక లేటెస్ట్ టాక్ ఏంటంటే ఈ బయోపిక్‌లో కీలకమైన ఎన్టీఆర్ భార్య బసవతారకం రోల్ కోసం ఓ యంగ్ హీరోయిన్‌ను తేజ సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆ యంగ్ హీరోయిన్ ఎవరో కాదు అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్, అఆ, శతమానం భవతి సినిమాలతో అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం అనుపమ రామ్‌తో ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, నానితో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలు చేస్తోంది.
అనుపమ అయితే.. ఈ సినిమాకి బాగా సరిపోతుందని తేజ భావిస్తున్నారట. ఇప్పటికే ఆమెను సంప్రదించారట కూడా. దీనిపై ఆమె సమాధానం మరో రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు తేజ చెప్పాడు.