
ఇటీవల కొంతకాలంగా బాలీవుడ్ వర్సెస్ సౌత్ అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ డామినేషన్ కనిపించేది. కానీ ప్రస్తుతం సౌత్ లో తయారవుతున్న చిత్రాలు బాలీవుడ్ ని ఓవర్టేక్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని బాలీవుడ్ ప్రముఖులే స్వయంగా అంగీకరిస్తున్నారు.
దేశవ్యాప్తంగా కార్తికేయ 2 చిత్రం సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో చందూ ముండేటి తెరకెక్కించిన ఈ చిత్రం 100 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. అసలు థియేటర్లే దొరకని పరిస్థితి నుంచి ఇండియా మొత్తం సంచలనం సృష్టించే స్థాయిలో ఈ చిత్రం విజయాన్ని నమోదు చేసుకుంది.
ఈ మూవీలో బాలీవుడ్ నటుడు 5 నిమిషాల పాత్రలో కనిపించారు. ఆయన పాత్ర 5 నిమిషాలే అయినప్పటికీ కృష్ణుడి గురించి చెప్పిన డైలాగ్స్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. నార్త్ ఆడియన్స్ ప్రతి ఒక్కరూ ఈ చిత్రానికి కనెక్ట్ అవుతున్నారు. తాజాగా అనుపమ్ ఖేర్ ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ కి చురకలంటించారు. బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ని అమ్ముకోవాలని చూస్తుంటే.. సౌత్ వాళ్ళు మాత్రం మంచి కథలతో వస్తున్నారు అని ప్రశంసించారు.
కేవలం అమ్ముడు పోవడం పైనే ద్రుష్టి పెట్టినప్పుడు సమస్య మొదలవుతుంది. వినియోగదారులు తగ్గిపోతారు. ప్రస్తుతం బాలీవుడ్ లో జరుగుతోంది అదే అని అనుపమ్ ఖేర్ అన్నారు. ఒక గొప్ప చిత్రాన్ని తెరకెక్కించినప్పుడు స్టార్ స్టేటస్ అవసరం ఉండదు. స్టార్ స్టేటస్ ని అమ్ముకోవాలని చూస్తే థియేటర్లు ఖాళీ అవుతాయి అని హెచ్చరించారు.
సౌత్ లో ప్రతి భాషల్లో వారి పరిమితులకు లోబడి అద్భుతమైన చిత్రాలు తీస్తున్నారు అని అనుపమ్ ఖేర్ ప్రశంసించారు. అనుపమ్ ఖేర్ ఈ ఏడాది కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో కూడా ఘనవిజయం సొంతం చేసుకున్నారు.