
లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 97వ అకాడమీ అవార్డుల వేడుక గ్రాండ్ గా జరిగింది. విజేతలకు ఆస్కార్ అవార్డులు అందించారు. ఆస్కార్స్ 2025లో మైకీ మాడిసన్ ఉత్తమ నటిగా, ఆడ్రిన్ బ్రాడీ ఉత్తమ నటుడిగా నిలిచారు. మైకీ మాడినస్ అనోరా చిత్రానికి గాను ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకుంది. పాతికేళ్ల వయసులోనే పట్టుమని 10 చిత్రాల్లో కూడా నటించకుండానే మైకీ మాడిసన్ ఈ ఘనత సాధించింది.
ఆస్కార్ అవార్డ్స్ 2025లో ఆమె నటించిన అనోరా చిత్రం సంచలనం సృష్టించింది. అందరూ భారీ అంచనాలు పెట్టుకున్న యాక్షన్ మూవీ డ్యూన్ 2ని వెనక్కి నెట్టి అనోరా చిత్రం ఆస్కార్స్ లో సత్తా చాటింది. అనోరా చిత్రానికి మొత్తం 5 విభాగాల్లో అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అనోరా చిత్రం ఆస్కార్స్ గెలుచుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ చిత్రాల అభిమానులు డ్యూన్ 2కి ఆస్కార్స్ లో ఎక్కువ అవార్డులు వస్తాయని ఆశించారు. కానీ ఈ చిత్రాన్ని అనోరా మూవీ దారుణంగా దెబ్బ కొట్టింది. డ్యూన్ 2కి కేవలం 2 ఆస్కార్ అవార్డులు మాత్రమే దక్కాయి. అంతలా ఈ చిత్రంలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. సీన్ బేకర్ దర్శకత్వంలో అనోరా చిత్రం తెరకెక్కింది. ఇది ఒక వేశ్య ప్రేమ కథ. క్లబ్ లో స్ట్రిప్ డ్యాన్సర్ గా, సెక్స్ వర్కర్ గా పనిచేసే అమ్మాయి కథే ఈ చిత్రం. ఇవాన్ అనే యువకుడు బాగా డబ్బున్న వ్యాపారవేత్త కొడుకు. వెకేషన్ కోసం అమెరికా వెళతాడు. అక్కడ ఇవాన్ కి క్లబ్ లో అనీ( మైకీ మాడిసన్) అనే సెక్స్ వర్కర్ పరిచయం అవుతుంది. వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంటారు.
కానీ ఇవాన్ తల్లి దండ్రులు వీళ్ళిద్దరిని విడదీసి అతడికి వేరే పెళ్లి చేయాలనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ చిత్ర కథ. ఫస్ట్ హాఫ్ మొత్తంస్ శృంగార సన్నివేశాలు, బూతు డైలాగులతో నిండిపోయి ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి కథ ఎమోషనల్ గా మారుతుంది. మైకీ మాడిసన్ సెక్స్ వర్కర్ గా బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. ఆమె బోల్డ్ నటనకే ఆస్కార్ దక్కింది అని చెప్పొచ్చు.