
జబర్థస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయమైన నటి రష్మీ గౌతమ్. ఆ షో ద్వారా ఆమెకు చాలా పాపులారిటీ వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రష్మి.. మరో కొత్త సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా ప్రమెషన్స్ లో భాగంగా ఆమె ఫేస్ బుక్ లైవ్ చాట్ లో అభిమానులతో మాట్లాడింది. లైవ్ చాట్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మేకప్ లేకుండా ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చిన రష్మీని నెటిజన్లు కామెంట్లతో విసిగించారు. మేకప్ లేకుండా కనిపించాలా వద్దా అనేది తన సొంత నిర్ణయమని చెప్పింది. తనకు నచ్చిన విధంగా ఉండాలని కోరుకొంటానని.. ఒకరి కోసం తన నిర్ణయాలు మార్చుకొనని తేల్చి చెప్పింది. సొంత ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవడం చాతకాని వాళ్లు తన మేకప్ గురించి మాట్లాడుతారా అని రష్మీ మండిపడింది.
తెలుగు భాష మాట్లాడటం రాని నువ్వు తెలుగు సినిమాల్లో నటించడం మానుకో అని ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నేను వైజాగ్‌లో పుట్టి పెరిగాను. నా తల్లి ఒరిస్సా, తండ్రి యూపీకి చెందిన వాళ్లు. నేను కేంద్రీయ విద్యాలయాల్లో చదివాను. అక్కడ ప్రాంతీయ భాషను ప్రోత్సహించరు. కేవలం హిందీనే నేర్పిస్తారు. కేవలం భాష, ప్రాంతం, కులాన్ని ఆధారంగా చేసుకొని ఒకరి ప్రతిభను అంచనా వేయవద్దు’ అని రష్మీ గట్టిగానే సమాధానం చెప్పింది.
‘సుడిగాలి సుధీర్‌తో పెళ్లి ఎప్పుడు చేసుకొంటున్నారని, ఇంకా ఏదో చాలా మంది అడుగుతుంటారు. కానీ సుధీర్ నేను ప్రొఫెషనల్‌గా మంచి స్నేహితులం. ఇద్దరం కలిసి జబర్దస్త్, ఢీ అనే రెండు షోలు చేస్తున్నాం. అదేకాకుండా చాలా ఈవెంట్లు చేస్తుంటాం. షూటింగ్ సందర్భంగా చాలా క్లోజ్‌గా ఉంటాం. అలా అని మా మధ్య రిలేషన్ గురించి ఓ నిర్ణయానికి మీరు రావొద్దు. అందరితో క్లోజ్‌గా ఉన్నట్టే సుధీర్‌తో కూడా ఉంటాను. అంతా మాత్రాన ఇద్దరం పెళ్లి చేసుకొంటారా అని అడగడం సరికాదు. సుధీర్ చేసే కొన్ని ఎపిసోడ్స్ చాలా ఎక్సైటింగ్‌గా ఉంటాయి. వాళ్లు చేసే స్కిట్స్ ఫన్నీగా బాగా ఉంటాయి. వచ్చే ఫిబ్రవరిలో జబర్ధస్త్‌కు ఐదేళ్లు పూర్తవుతుంది. సుధీర్, చంద్ర, ప్రకాశ్, రాంప్రసాద్ వారితో కలిసి ఐదేళ్లుగా పనిచేస్తున్నాను. కాబట్టి మా మధ్య క్లోజ్ రిలేషన్ ఉంటాయి. ఒకే వయసు ఉండటంతో ఎక్కువగా కనెక్ట్ అవుతాం మీరందరూ కేవలం నాపై, సుధీర్‌పై మాత్రమే దృష్టిపెడుతారు. అందుకే మీకు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది అని రష్మీ ముఖం మీదే చెప్పేసింది.