
సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ వరస సిని ప్రాజెక్టులతోనూ దూసుకుపోతోంది. ఇప్పటికే అనేక సినిమాలతో బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు వెబ్ సీరిస్ లపై దృష్టి పెట్టింది. గురజాడ అప్పారావు గారి ప్రఖ్యాత నాటకం “కన్యాశుల్కం” ఆధారంగా రూపొందుతున్న వెబ్ సిరీస్ కు అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. క్రిష్ సారధ్యంలో ఈ సీరిస్ రూపొందనుందని... ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు.
తెలుగులో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న సోనీ లివ్ ఓటీటీ కోసం ఆయన ఈ వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసిన క్రిష్ దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేస్తాడట. అంటే వేరే వారి దర్శకత్వం చేస్తారన్న మాట. పవన్ తో 'హరి హర వీరమల్లు' సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా ఉండటం వలన ఆయన దర్శకత్వ బాధ్యతలను వేరే వారికి అప్పగిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ షూటింగు మొదలుకానుందని అంటున్నారు.
'కన్యాశుల్కం' నాటకం అప్పటి బాల్యవివాహాలు .. వితంతు వివాహాలతో పాటు ఇతర మూడాఛారాలు ఆనాటి సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేశాయనేది చాటి చెబుతుంది. అలాగే ఆచారాల పేరుతో స్త్రీ స్వేచ్ఛని అణచివేసే ప్రయత్నాలు బలంగా జరిగిన తీరు కనిపిస్తుంది. ఆ నాటకాన్ని ఈ కాలంలోని సమస్యలతో ముడిపెట్టి మోడ్రన్ గా చేసినట్లు చెప్పుతున్నారు. ఈ నాటకంలో గిరీశం .. మధురవాణి .. బుచ్చమ్మ .. రామప్ప పంతులు .. లుబ్ధావధానులు .. కరటక శాస్త్రి .. సుబ్బి తదితర పాత్రలు ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. వాటిని ఈ కాలానికి మార్చినట్లు చెప్తున్నారు. నాటకంలో ప్రతి పాత్ర ఒక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. వెబ్ సిరీస్ గా ఈ నాటకం ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.
బిజీ షెడ్యూల్స్ కారణంగా అనసూయ “జబర్దస్త్” షో నుంచి తప్పుకున్నట్టు , సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు సమాచారం. అనసూయ ప్రస్తుతం “రంగమార్తాండ “,“ఫ్లాష్ బ్యాక్ ”, “గాడ్ ఫాదర్ ”, మైఖేల్ “, వాంటెడ్ పండుగాడ్ ” , “అరి” , “దర్జా” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ “భీష్మ పర్వం “ మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.