తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ సరికొత్త షోలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే డాన్స్, సింగింగ్ రియాలిటీ షోలను అందించింది. తాజాగా బిజినెస్ రియాలిటీ షోతో అలరించేందుకు సిద్ధమైంది.
లోకల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ Aha ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ ను తీసుకురావడంలో ఎప్పుడూ ముందుంటుంది. సరికొత్త షోలతో ఎప్పటికప్పుడు ఆడియెన్స్ ల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఇప్పటికే సినిమాలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. మరోవైపు ‘తెలుగు ఇండియన్ ఐడల్‘ సీజన్ 1, 2, కామెడీ ఎక్స్ ఛేంజ్ వంటి రియాలిటీ షోలతోనూ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించారు. ఇక తాజాగా సరికొత్త రియాలిటీ షోతో రాబోతున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈసారి మహిళలకు ఉపయోగపడేలా షో ప్రసారం కానుంది.
ఇండియాలో నెంబర్ వన్ లోకల్ ఓటీటీ మాధ్యమం ఆహా ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమైంది. స్త్రీ సాధికారతకు పెద్ద పీట వేస్తూ మహిళలను వ్యాపార రంగంలోనూ దూసుకెళ్లేలా చేయటానికి బిజినెస్ రియాలిటీ షోను ప్రారంభించింది... అదే ‘నేను సూపర్ ఉమెన్’. కొత్త పరిశ్రమలను స్థాపించేలా మహిళలను ప్రేరేపించటమే ఈ రియాలిటీ షో ప్రధాన లక్ష్యం. దీని కారణంగా పారిశ్రామిక రంగంలో మహిళల ప్రాదాన్యత పెరగటంతో పాటు వారిలో ఆర్థిక స్వాతంత్య్ర భావనను పెంపొందుతుంది.
‘నేను సూపర్ ఉమెన్’ (Nenu Super Woman) ప్రోగ్రామ్ సాంప్రదాయ మార్గాల్లో కాకుండా వినూత్న మార్గాలను సూచిస్తూ, మహిళలకు మార్గదర్శకం చేస్తూ వారికి ప్రత్యక్ష అనుభవం ఏర్పడేలా చర్యలు తీసుకుంటుంది. శ్రీరామ్ చంద్ర హోస్ట్ చేస్తోన్న ఈ కార్యక్రమంలో ఏజెంల్స్ అనే ప్యానెల్ ఉంటుంది. ఇందులో పాల్గొనే ఔత్సాహిక మహిళా వ్యాపారులు వారి ఆలోచనలను ఈ ఏజెంల్స్ కు తెలియచేయవచ్చు. అలాగే కంటెస్టెంట్స్‌కు శ్రీరామ చంద్ర తగిన రీతిలో మార్గదర్శకత్వం చేయటం ద్వారా ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనటంలో సందేహం లేదు. కఠినమైన ఎంపిక తర్వాత 40 మంది అసాధారణ అభ్యర్థులు ఈ ‘సూపర్ ఉమెన్’కు ఎంపికయ్యారు. వీరందరూ ఏంజెల్స్ ప్యాసమక్షంలో తమ ఆలోచనలను ముఖాముఖిగా ప్రదర్శిస్తారు. ప్రతి ఆలోచన చాలా జాగ్రత్తగా మూల్యాంకనం చేయబడుతుంది. తుది ప్రదర్శన తర్వాత ప్యానెల్ ఆఫర్స్‌ను పొడిగిస్తుంది.
ఈ ఏంజెల్స్ వారి వారి రంగాల్లో తమదైన గుర్తింపు సంపాదించుకున్నారు.
రోహిత్ చెన్నమనేని (డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు),
శ్రీధర్ గాది (క్వాంటెలా ఇన్క్ వ్యవస్థాపకుడు మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్),
రేణుకా బొడ్లా (సిల్వర్ నీడెల్ వెంచర్స్ భాగస్వామి),
సుధాకర్ రెడ్డి (అభి బస్ వ్యవస్థాపకుడు, సీఇఓ),
దొడ్ల దీపా రెడ్డి (దొడ్ల డెయిరీ),
సింధూర పొంగూరు (నారాయణ గ్రూప్).
వీరందరూ తమ రంగాల్లో ఎంతో నైపుణ్యం సాధించిన నిష్ణాతులు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టటానికి, విభిన్న నేపథ్యాలున్న మహిళలను పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించటానికి సిద్ధంగా ఉన్నారు.
ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘నేను సూపర్ ఉమెన్’ షో ఆహాలో ప్రారంభం కావటానికి సిద్ధంగా ఉంది. మహిళలు వ్యాపార రంగంలో రాణించటానికి ఇదొక కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఫలితంగా ఎంతో మంది వారి కలలను సాధించుకునే దిశగా అడుగులు వేయబోతున్నారు. ప్రస్తుతం ఓటీటీలో రీసెంట్ గా నరేష్ -పవిత్రల ‘మళ్లీ పెళ్లి’ స్ట్రీమింగ్ అవుతోంది. మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటోంది.