నటుడిగా తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు పొందిన వైభవ్ రెడ్డి (Vaibhav Reddy) నెక్ట్స్ ‘ఆలంబన’ చిత్రంతో రాబోతున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాలకు గ్యాప్ ఇవ్వడంపై స్పందించారు.
హీరో వైభవ్ గతంలో తెలుగు చిత్రాల్లో నటించారు. పలు కీలక పాత్రలు పోషించి ఆడియెన్స్ ను అలరించారు. ఈయన ఎవరో కాదు.. సీనియర్ దర్శకుడు కోదండ రామిరెడ్డి తనయుడు కావడవం విశేషం. కోలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తున్న వైభవ్ తెలుగులోనూ ‘గొడవ’, ‘కాస్కో’, ‘యాక్షన్ 3డీ’, ‘అనామిక’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. కోలీవుడ్ నెక్ట్స్ దళపతి68లోనూ నటిస్తున్నారు. అయితే వైభవ్ నటించిన తాజా సినిమా 'ఆలంబన' (Aalambana) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయన సరసన పార్వతి నాయర్ కథానాయికగా నటించారు. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషించారు. పారి కె విజయ్ దర్శకత్వం వహించారు. కోటపాడి జె రాజేష్ సమర్పణలో కేజేఆర్ స్టూడియోస్, కౌస్తుభ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది. డిసెంబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సందర్భంగా వైభవ్ మాట్లాడుతూ... ‘నాకు చాలా పెద్ద సినిమా ఇది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తెలుగులో మహేశ్వర్ రెడ్డి గారు విడుదల చేస్తున్నారు.ఇప్పుడు ఓటీటీ సినిమా, థియేటర్ సినిమా అని అందరూ మనకు చెబుతున్నారు. ఇది థియేటర్ సినిమా. థియేటర్లో చూస్తేనే ఆ విజువల్ బ్యూటీ & గ్రాండియర్ ఉంటుంది. ఆ కామెడీని థియేటర్లలో బాగా ఎంజాయ్ చేస్తారు. డబ్బింగ్ వెర్షన్ చూశా. చాలా బాగా వచ్చింది. తెలుగులో గ్యాప్ తీసుకోలేదు. అప్పుడప్పుడూ తెలుగు నుంచి మంచి క్యారెక్టర్లు వచ్చాయి. కానీ, మిస్ అయ్యింది. గ్యాప్ వచ్చిందంతే! ఈ సినిమాకు వస్తే... మంచి ఫన్ ఫిల్మ్. పీటర్ మాస్టర్ రెండు బ్రహ్మాండమైన ఫైట్స్ చేశారు. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ బావుంటుంది. మంచి సాంగ్స్ ఇచ్చారు. సినిమా మొదలైన 15 నిమిషాల తర్వాత జీనీ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత నుంచి చివరి వరకు ఉంటుంది. జీనీగా నటించిన మునిష్ కాంత్, హీరోయిన్ పార్వతి... అందరితో యాక్ట్ చేయడం ఎంజాయ్ చేశా’ అని చెప్పుకొచ్చారు.
దర్శకుడు పారి కె విజయ్ మాట్లాడుతూ... ''నా తొలి చిత్రమిది. తమిళంలో పాటు తెలుగులో కూడా విడుదల అవుతుండటం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఎంత మంది దర్శకులకు వస్తుందో తెలియదు. మా నిర్మాత రాజేష్ గారికి కథ చెప్పా. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని, ఏ విషయంలోనూ రాజీ పడొద్దని చెప్పారు. పీటర్ హెయిన్స్ గారు మంచి వర్క్ చేశారు. ఫైట్స్ కంటే ఈ సినిమాలో డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. ఆయన బాగా చేశారు. యూనివర్సల్ కాన్సెప్ట్ తీసుకుని చేసిన సినిమా ఇది. ఆంధ్ర, తెలంగాణలో ఎక్కువ థియేటర్లు ఉన్నాయి. దాన్ని బట్టి సినిమా అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంత ప్రేమ అనేది అర్థం అవుతుంది. క్రిస్మస్ సెలవుల్లో వస్తున్న ఈ సినిమాను అందరు ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు.
పార్వతి నాయర్ మాట్లాడుతూ... ‘తెలుగు నుంచి ఇంతకు ముందు కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ, చేయడం కుదరలేదు. అది మా బ్యాడ్ లక్. నేను నటించిన సినిమా తెలుగులో విడుదల కావడం సంతోషంగా ఉంది. మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. నాకు ఫాంటసీ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో క్యారెక్టర్ బాగా నచ్చింది. ప్రేక్షకులకూ నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చింది. అలాగే గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ‘శివ కార్తికేయన్ 'వరుణ్ డాక్టర్' తర్వాత తెలుగులో మేం విడుదల చేస్తున్న చిత్రం ఇది. 'ఆలంబన' అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. ప్రేక్షకులందరినీ నవ్విస్తుంది. వైభవ్ చాలా బాగా నటించారు. కామెడీతో పాటు ఫైట్స్ కూడా బాగా చేశార’ని అన్నారు.