
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం దేశవ్యాప్తంగా వివాదాలతో నలిగిపోతోంది. ముఖ్యంగా దర్శకుడు, నిర్మాతలు హిందూ సంఘాల ఆగ్రహానికి గురవుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం ముందు నుంచి వివాదాలతోనే సాగుతోంది.
జూన్ 16న రిలీజ్ అయ్యాక ఆ వివాదాలు మరింత ఎక్కువయ్యాయి. ఓం రౌత్ పడ్డ కష్టం మొత్తం బ్యాక్ ఫైర్ గా మారింది. దానికి కారణం ఒక్కటే వినిపిస్తోంది.. రామాయణంతో ప్రయోగాలు చేయడమే. ఉత్తరప్రదేశ్ లో చాలా చోట్ల ఈ చిత్ర ప్రదర్శనని నిషేదించాలని నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అయోధ్య ప్రధాన అర్చకులు మాట్లాడుతూ.. వెంటనే ప్రభుత్వం ఆదిపురుష్ చిత్రాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ చిత్రంలో డైలాగులు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవని అయోధ్య ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. హిందూ ఇతిహాసాలని ఈ రకంగా అపహాస్యం చేసేలా ఇంకెవరూ ప్రయత్నించని విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చిత్రంలో కొన్ని పాత్రలు గమనిస్తే ముస్లిం వేషధారణలు గుర్తుకు వస్తాయని ఆయన ఆరోపించారు.
ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ రాముడు, సీత, రావణుడు, లక్ష్మణుడు, హనుమంతుడు పాత్రలో ఈ చిత్రంలో చరిత్రకి దూరంగా ఉన్నాయని అన్నారు. బాలీవుడ్ వారికి మన ఇతిహాసాలు, సంస్కృతి పట్ల గౌరవం లేదని.. మనోభావాల్ని వారు గౌరవించడం లేదని ఆరోపించారు.
అయోధ్యలోని హనుమాన్ గిరి టెంపుల్ ప్రధాన అర్చకులు మహంత్ రామ్ దాస్ మాట్లాడుతూ.. హిందువులపై విదేశీ కుట్రలో భాగంగానే ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కించారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఆదిపురుష్ టీం ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి. మూవీ రిలీజైనప్పటి నుంచి ప్రభాస్ సైలెంట్ గా ఉంటున్నారు.