మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య వివాదం నడుస్తుండగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఒకే వేదికపై కలవడం ఆసక్తి రేపుతోంది. వీరిద్దరూ పలకరించుకుంటారా? లేదా? అనే చర్చ మొదలైంది.
ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపాడు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి శిల్పా రవిరెడ్డి పోటీ చేశాడు. అతడు అల్లు అర్జున్ కి మిత్రుడు. దీంతో స్వయంగా నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ శిల్పా రవికి ఓటు వేయాలని కోరాడు. మరోవైపు జనసేన కూటమిలో భాగంగా ఉంది. వైసీపీ పార్టీ కూటమి ప్రధాన ప్రత్యర్థి పార్టీ. ఈ క్రమంలో అల్లు అర్జున్ తీరు పవన్ కళ్యాణ్ కి నచ్చలేదు. నాగబాబు, సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా తమ అసహనం ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ సైతం అల్లు అర్జున్ టార్గెట్ గా విమర్శలు చేశాడు. పుష్ప సినిమాను ఉద్దేశిస్తూ.. గతంలో హీరోలు అడవులను అభివృద్ధి చేసే పాత్రలు చేసేవారు. కానీ ఇప్పటి హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు. సినిమా వాడిగా అలాంటి పాత్రలు చేయడం నాకు ఇష్టం ఉండదు అన్నాడు. అనంతరం తనకు నచ్చితే, ఇష్టమైతే వస్తాను, ఎక్కడికైనా వెళతాను అని... అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి కౌంటర్ ఇచ్చాడు.
పవన్ కళ్యాణ్ కామెంట్స్ ని అల్లు అర్జున్ మామయ్య చంద్ర శేఖర్ రెడ్డి ఖండించారు. అల్లు అర్జున్ సినిమాలో స్మగ్లింగ్ చేశాడు. నిజ జీవితంలో కాదు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ సరికాదన్నట్లు ఆయన మాట్లాడారు. ఇక అల్లు అర్జున్ కి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. అసలు అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ లేరు. మెగా హీరోల ఫ్యాన్స్ ఆయన్ని ఆదరించారు. అల్లు అర్జున్ ఏమైనా పెద్ద పుడింగా.. అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు.
ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు-మెగా కుటుంబాల ఆ మధ్య మనస్పర్థలు తలెత్తాయి. కోల్డ్ వార్ నడుస్తుందనే వాదన బలపడింది. పవన్ కళ్యాణ్-అల్లు అర్జున్ నిప్పు ఉప్పులా తయారయ్యారు. ఈ క్రమంలో వారిద్దరూ ఒకే వేదిక పంచుకోవడం ఆసక్తి రేపుతోంది. నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానం మొదలై 50 ఏళ్ళు కావస్తోంది. దీన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 1న స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నారు. బాలయ్యను టాలీవుడ్ ఘనంగా సన్మానించనుంది.
ఈ వేడుకకు టాలీవుడ్ పెద్దలతో పాటు ఇతర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు కూడా ఆహ్వానం అందింది. తాజాగా అల్లు అర్జున్ ని మా సభ్యులు, టీఎఫ్ సీసీ, టీఎఫ్ పీసీ సభ్యులు బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు ఆహ్వానించారు. బాలకృష్ణ ఫ్యామిలీతో అల్లు అరవింద్ ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆహాలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో చేస్తున్న సంగతి తెలిసిందే.
కాబట్టి అల్లు అర్జున్ స్వర్ణోత్సవాలు హాజరు అవుతారు. అదే వేదికపై చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు. మరి వారితో అల్లు అర్జున్ ఎలా వ్యవహరిస్తారు అనే చర్చ మొదలైంది. మెగా-అల్లు కుటుంబాల వార్ పతాక స్థాయిలో ఉండగా ఈ పరిమాణం ఆసక్తి రేపుతోంది.