
ఇప్పుడు అందరి దృష్టీ బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 'బ్రహ్మాస్త్ర' పైనే ఉంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించారు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను 'బ్రహ్మాస్త్రం' పేరుతో విడుదల కానుంది. సెప్టెంబర్ 9న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో దర్శక ధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చారు. ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం తెలుగులో ఏ మేరకు వర్కవుట్ కానుందనే విషయం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది.
అయితే రిలీజ్ రోజు ఈ సినిమాకు ట్విస్ట్ పడింది. అదే రోజు హైదరాబాద్ నగరంలో నిమజ్జనం ఉంటుందని అధికారిక వర్గాలు ప్రకటించాయి. కాబట్టి ఆ రోజంతా జనాలు గణేష్ నిమజ్జనం హడావిడిలో ఉంటారు. దాదాపు సిటీ మొత్తం బంద్ వాతావరణం నెలకొంటుంది. జనాలు రోడ్లమీదకొచ్చి వరస పెట్టి నిమజ్జనాలకు వెళ్తున్న విగ్రహాలను చూసేందుకు ఉత్సాహం చూపిస్తారు.
ఇళ్లలోంచి బయటకి రాలేని వాళ్ళు టీవీ లైవ్ తో బిజిగా ఉంటారు. ట్యాంక్ బండ్ దగ్గర హడావిడి గురించి అయితే చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో రోడ్లు మొత్తం ట్రాఫిక్ జామ్ తో బ్లాక్ అయ్యి ఉంటాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు ఆ రోజు ఎంతమంది సినిమా చూడటానికి బయిటకువస్తారనేది వేచి చూడాల్సిన విషయం. ఖచ్చితంగా కలెక్షన్స్ పై ఈ ఇంపాక్ట్ ఉంటుందంటున్నారు. దీన్ని ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి.
ఇక పెళ్లి తరువాత అలియా-రణబీర్ జంట నుంచి విడుదల కాబోయే సినిమా ఇదే. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం బాగా ఖర్చు పెట్టారు. 'బ్రహ్మాస్త్ర'లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున అక్కినేని, మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రీతం ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 40 శాతం అక్యుపెన్సీతో 50 వేలకు పైగా టికెట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మల్టీ ప్లెక్సుల్లో హిందీ వెర్షన్ కి 325 రూపాయల ధర పెట్టినా చెప్పుకోదగ్గ స్థాయిలో అమ్మకాలు జరిగాయంటున్నారు.సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అంత రెవెన్యూ రాబడుతుందా..? అనేది వేచి చూడాల్సిన విషయం.