ఆయనకు దేవుడు, యాదాద్రిపై అందుకే కేసీఆర్ బొమ్మ చెక్కాడు: కిషన్ రావు

By telugu teamFirst Published Sep 7, 2019, 10:20 AM IST
Highlights

తిరుపతిపై శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఉందని, యాదాద్రిలో కేసీఆర్ చిత్రం ప్రాకారాలపై ఉండడంలో తప్పేమీ లేదని, శిల్పులు కేసీఆర్ ను రాజుగానే భావిస్తున్నారని, శిల్పి హరిప్రసాద్ కు కేసీఆర్ దేవుడిలా కనిపించాడని కిషన్ రావు వివరణ ఇచ్చారు. 

యాదాద్రి: యాదాద్రి శిలలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చిత్రాన్ని చెక్కడంపై దుమారం చెలరేగడంతో యాదగిరి గుట్ట దేవస్థానం అభివృద్ధి సంస్థ (వైటీడీఎ) వైఎస్ చైర్మన్ కిషన్ రావు ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయితో కలిసి రంగంలోకి దిగారు. శిల్పి హరిప్రసాద్ కేసీఆర్ ను దేవుడిగా భావించాడని, అందుకే అష్టభుజి ప్రాకారాలపై కేసీఆర్ చిత్రం చెక్కారని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో చెప్పారు. 

శిల్పులంతా కేసీఆర్ ని దేవుడిలా చూస్తున్నారని, కేసిఆర్ వల్లనే తమ కుటుంబాలు బతుకున్నాయని భావిస్తున్నారని కిషన్ రావు అన్నారు. కేసీఆర్ నాకు దేవుడిగా అనిపించాడని శిల్పి హరిప్రసాద్ లేఖ కూడా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కేసీఆర్ బొమ్మను చెక్కాలని ఎవరూ చెప్పలేదని, ఏయే బొమ్మలు చెక్కాలనే విషయాన్ని తాము శిల్పులకు చెప్పలేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. యాదాద్రి దేవాలయ ప్రాకారాలపై కేసిఆర్, కారు బొమ్మలను చెక్కడంలో తప్పు లేదని ఆయన చెప్పారు. 

చరిత్రను తెలిపేదే దేవాలయమని, భావితరాలకు చరిత్రనూ సమకాలీన అంశాలనూ చెప్పడం కోసం వాటిని చెక్కారని ఆయన అన్నారు. కారును మాత్రమే కాదు, సైకిల్, ఎడ్ల బండిని కూడా చెక్కామని, ఈ కాలంలో వీటిని ఉపయోగిస్తున్నామని చెప్పడమే తమ ఉద్దేశమని అన్నార. 

తిరుపతి కొండపై శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కూడా ఉందని కిషన్ రావు గుర్తు చేశారు. యాదాద్రి పనులను ఒక రాజు అప్పగించినట్లుగానే భావించి తాము చిత్రాలు చెక్కామని అన్నారు. నాగార్జునసాగర్ బుద్ధవనం ప్రాజెక్టులోనూ కేసీఆర్ ఫొటో ఉందని, అప్పట్లో కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారని ఆయన గుర్తు చేశారు. అప్పుడు అక్కడ హరిప్రసాద్ పనిచేశారని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ చిత్రాలను ఎందుకు చెక్కలేదనే ప్రశ్నలకు సరైన సమాధానం లేదు.

సంబంధిత వార్తలు

యాదాద్రి శిల్పాలపై అధికారుల వివరణ: భావి తరాల కోసమే కేసీఆర్, కారు చిత్రాలు, రాజకీయ ఉద్దేశం లేదు

యాదాద్రి శిల్పాలపై కేసీఆర్ బొమ్మలు

click me!