అన్నదాతలకు అండగా... వచ్చే గురువారమే పత్రికా ప్రకటన...: జగన్

By Arun Kumar PFirst Published Dec 10, 2019, 5:48 PM IST
Highlights

ఇప్పటికే రైతు భరోసా ద్వారా అన్నదాతలను ఆదుకుంటున్న తమ ప్రభుత్వం మరింత  భరోసా ఇచ్చేందుకు సిద్దమయ్యిందని ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు.  

అమరావతి: రాష్ట్రంలో రైతులు అధికంగా పండించే ప్రతి పంటకు గిట్టుబాటు అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సాక్షిగా అన్నదాతలకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా వరి, జొన్న, మొక్కజొన్న, రాగి, కందులు, మినుములు, పెసలు, శెనగ, వేరుశెనగ, పసుపు, మిరప మొదలైన పంటలకు కనీస గిట్టుబాటు ధరలను ప్రకటిస్తామని వెల్లడించారు.

మంగళవారం అసెంబ్లీలో రైతు భరోసా అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న సీఎం రైతులకు భరోసానిచ్చే ప్రకటన చేశారు. కనీస గిట్టుబాటు ధరకంటే తక్కువ రేటుకు ఏ రైతు కూడా పంటను అమ్ముకోవాల్సిన పనిలేదన్నారు. 

పంటల గిట్టుబాటుపై వచ్చే గురువారం పత్రికల్లో ప్రకటనలు ఇస్తామన్నారు. కనీస గిట్టుబాటు ధర లభించకపోతే కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి పంటను అమ్ముకోవచ్చని అన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా పత్రికా ప్రకటనల్లో పొందుపరుస్తామని సీఎం పేర్కొన్నారు. 

read more ఉల్లి కొరతపై జగన్ సంచలన నిర్ణయం...బోర్డర్లు సీజ్‌: మంత్రి కన్నబాబు

రైతులకు ఏదైనా సమస్య ఉంటే తెలియజేయడానికి  ఓ ఫోన్‌ నంబర్‌ కూడా పెడుతున్నట్లు తెలిపారు. సమస్య గురించి తెలుసుకున్న వెంటనే పరిష్కరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. 

తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని రుజువు చేసుకోవడానికి నాలుగు అడుగులు ఎప్పటికీ ముందుకే వేస్తామన్నారు. చంద్రబాబు నాయుడి మాదిరిగా మోసం చేసే ప్రభుత్వం తమది కాదన్నారు. 

రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతామని చెప్పారు. ఈ నిధితో ఖచ్చితంగా రైతుకు అండగా ఉంటామన్నారు. ధాన్యం కొనుగోళ్ల గురించి ప్రతిపక్ష నేత మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. 

read more  నాకో న్యాయం...వల్లభనేని వంశీకో న్యాయమా: ప్రశ్నించిన టిడిపి ఎమ్మెల్యే 

రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి గత ప్రభుత్వంలో రూ.960 కోట్లు బకాయిలు పెడితే వాటిని తాము అధికారంలోకి వచ్చాక  చెల్లించాం అని చెప్పడానికి గర్వపడుతున్నామని.. ఆ డబ్బు ఇవ్వలేనందుకు ప్రతిపక్షనేత సిగ్గుతో తలవంచుకోవాలని జగన్ ఎద్దేవా చేశారు. 
 

click me!