టిడిపి అధినేత చంద్రబాబును విమర్శించి పార్టీ మారాలని చూస్తున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పొలిటికల్ కెరీర్ అగమ్యగోచరంగా తయారవనుందని మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప జోస్యం చెప్పారు.
అమరావతి: హైదరాబాద్‌లో తనకున్న భూములను కాపాడుకోవడానికే టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీని వీడారని మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే అతన్ని సస్పెండ్ చేశారని... అయినా ఏముఖం పెట్టుకొని అసెంబ్లీకి వస్తున్నాడో అర్ధంకావడం లేదంటూ చినరాజప్ప మండిపడ్డారు.
మంగళవారం అసెంబ్లీ ఆవరణలో చినరాజప్ప విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ ను కలిస్తే చంద్రబాబు తనను పార్టీనుంచి సస్పెండ్ చేశాడని వంశీ చెప్పడం సిగ్గుచేటన్నారు. తనపదవికి రాజీనామా చేయకుండా జగన్ పంచనచేరిన వంశీ సిగ్గులేకుండా ఇప్పుడు చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నాడని చినరాజప్ప విమర్శించారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం తప్పుకాదని ఆ నెపంతో తనకు రాజకీయ జన్మనిచ్చిన చంద్రబాబుని విమర్శించడం వంశీ ఇకనైనా మానుకోవాలని సూచించారు. ఒకవేళ వంశీ రాజీనామా చేస్తే తిరిగి ఎన్నికల్లో పోటీచేయడానికి జగన్ తనపార్టీ తరుపున అతనికి టిక్కెట్ కూడా ఇవ్వడని చినరాజప్ప జోస్యం చెప్పారు.
read more చంద్రబాబుపై రోశయ్య డైలాగ్ వదిలిన బుగ్గన: నాకు తెలివి ఉంటే కత్తి తీసుకుని...
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే క్రమంలో ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలను అన్నిరకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. అయినా వారి ప్రలోభాలకు లొంగకుండా వైసీపీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీలో ఉండే పోరాడుతామని ఆయన తెలిపారు.
గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో నేరాల తీవ్రత చాలాతక్కువగా ఉందని, వైసీపీ హయాంలో భూకబ్జాలు, రౌడీయిజం, బెదిరింపులు, ఆస్తులు లాక్కోవడం, మైనింగ్ మాఫియా వంటివి పెచ్చుమీరాయన్నారు. చంద్రబాబు పాలనలో ఆడబిడ్డలు ప్రశాంతంగా జీవించారని అన్నారు.
read more స్మశానంలా రాజధాని అమరావతి...అన్నది నిజమే, కానీ..: అసెంబ్లీలో బొత్స
అలా మహిళలు సురక్షితంగా వున్న కాలంలో ప్రతిపక్షంలో వుండి నానారాద్దాంతం చేసిన ఎమ్మెల్యే రోజా ఇప్పుడెందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని చినరాజప్ప నిలదీశారు.