అఫ్గాన్ బౌలర్లపై కోహ్లీ ప్రశంసలు: షమీ అమోఘమని కితాబు

By telugu teamFirst Published Jun 23, 2019, 7:51 AM IST
Highlights

అఫ్గానిస్తాన్ పై భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.  గత కొంత కాలం నుంచి భారత్‌ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోందని విరాట్ కోహ్లీ అన్నాడు. అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ సాగించాలనుకున్నామని చెప్పాడు.

సౌథాంప్టన్‌: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచులో అఫ్గానిస్తాన్ చూపిన ప్రదర్శనకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కితాబు ఇచ్చాడు. అదే సమయంలో తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. హ్యాట్రిక్ తో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన మొహమ్మద్ షమీని కొనియాడాడు. 

అఫ్గానిస్తాన్ పై భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.  గత కొంత కాలం నుంచి భారత్‌ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోందని విరాట్ కోహ్లీ అన్నాడు. అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ సాగించాలనుకున్నామని చెప్పాడు.  టాస్‌ గెలవడంతో భారీ స్కోరు చేద్దామనుకున్నామని, కానీ అనూహ్యంగా పిచ్‌ నుంచి సహకారం లభించలేదని అన్నాడు. 

పిచ్ సహకారం అందించకపోవడంతో పాటు ప్రత్యర్థి అఫ్గాన్ జట్టులో ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు ఉండడం తమకు ప్రతికూలంగా మారిందని,  270 పరుగులు అఫ్గాన్‌కు లక్ష్యంగా పెట్టుకున్నామని, కానీ తక్కువ పరుగులకే పరిమితమయ్యాయమని అన్నాడు. అఫ్గాన్‌ ఎనలేని ప్రతిభ ఉన్న జట్టు అని, ఓ సందర్భంలో తమను ఒత్తిడిలోకి నెట్టిందని అన్నాడు. 

మిడిల్‌ ఓవర్లలో అఫ్గాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారని, నబీ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించాడని, సమష్టిగా ఆడితే ఈ మ్యాచ్‌ గెలవచ్చు అని నిర్ణయానికి వచ్చామని అన్నాడు. భారత్‌ విషయానికి వస్తే షమి బౌలింగ్‌ అద్భుతమని, ఏ ఆటగాడైన అవకాశాల కోసం ఎదురుచూస్తుంటాడని, అందివచ్చిన అవకాశాన్ని షమి చాలా బాగా వాడుకున్నాడని కోహ్లీ అన్నాడు. 

తన మొదటి స్పెల్‌ బౌలింగ్‌ తీరు అద్వితీయమని, తొలుత పరిస్థితులకు అనుగుణంగా బుమ్రాతో బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నామని, అతను ఎక్కువ సేపు బౌలింగ్‌ చేస్తే వికెట్లు తీయగలడని అన్నాడు. అతను ప్రత్యర్థి జట్టును ఏ క్షణాన్నైనా కుప్పకూల్చే సత్తా ఉన్న ఆటగాడని చెప్పాడు. దీంతో మేము బమ్రా స్పెల్‌ను 49 ఓవరు వరకు ముగించి చివరి ఓవర్‌ను షమితో వేయించాలనుకున్నామని చెప్పాడు. 

తమ ప్రణాళిక బాగా పనిచేసిందని కోహ్లీ అన్నాడు. చాహల్‌, విజయ్‌శంకర్‌ జట్టు విజయంలో తమ వంతు సహకారాన్ని అందించారని అన్నాడు. పరిస్థితులు తమకు అనుకూలించకపోవడంతో చివరి బంతి వరకు కష్టపడాల్సి వచ్చిందని అన్నాడు. 

click me!