దక్షిణాఫ్రికా ఫీల్డర్ల మౌనం...ఔటైనా క్రీజును వదలని విలియమ్సన్

By Siva KodatiFirst Published Jun 20, 2019, 3:33 PM IST
Highlights

ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో నువ్వా నేనా అన్నట్లు జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కీవీస్ విజయంలో ఆ జట్టు కెప్టెన్ విలియమ్సన్ కీలక పాత్ర పోషించాడు. అయితే అతని ఆటతీరును దక్షిణాఫ్రికా మాజీ  క్రికెటర్ పాల్ ఆడమ్స్ తప్పుబట్టాడు. 

ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో నువ్వా నేనా అన్నట్లు జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కీవీస్ విజయంలో ఆ జట్టు కెప్టెన్ విలియమ్సన్ కీలక పాత్ర పోషించాడు.

అయితే అతని ఆటతీరును దక్షిణాఫ్రికా మాజీ  క్రికెటర్ పాల్ ఆడమ్స్ తప్పుబట్టాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్ల ఆలసత్వంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు విలియమ్సన్.

38వ ఓవర్‌లో తాహిర్ వేసిన ఆఖరి బంతి విలియమ్సన్ బ్యాట్‌ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. తాహిర్ గట్టిగానే అప్పీల్ చేసినా ఏదో లోకంలో ఉన్నట్లు కనిపించిన కీపర్ డి కాక్ కనీసం స్పందించలేదు.

దీంతో తాహిర్ నిరాశగా వెనుదిరిగాడు. తర్వాత టీవీ రిప్లయ్‌లో విలియమ్సన్ ‌ఔటయ్యేవాడని తేలింది. ఈ సమయానికి న్యూజిలాండ్ 67 బంతుల్లో 69 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉంది. ఒకవేళ విలియమ్సన్‌ వికెట్ తీసి వుంటే మ్యాచ్ సఫారీల చేతుల్లోకి వచ్చేసేది.

ఇక్కడ మరో విషయం ఏంటంటే దక్షిణాఫ్రికాకు ఒక రివ్యూ కూడా మిగిలే ఉండటం దురదృష్టకరం. దీనిపైనే పాల్ ఆడమ్స్ స్పందించాడు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అప్పీల్ చేయకుంటే.. విలియమ్సన్‌కు ఏమైంది... అతను క్రీడా స్ఫూర్తితో క్రీజు వదలి ఎందుకు వెళ్లలేదంటూ ఆడమ్స్ ప్రశ్నించాడు.

ఒకవేళ విలియమ్సన్‌ మన్కడింగ్ విధానంలో ఔటైతే... క్రీజును వదిలిపెట్టి వెళ్లడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇక అభిమానులు కూడా ఈ వ్యవహారంపై భిన్నంగా స్పందిస్తున్నారు.

కొందరు విలియమ్సన్‌ది తొండాటని తప్పుబడుతుండగా.. మరికొందరు వెనకేసుకొస్తున్నారు. కాగా దక్షిణాఫ్రికా కెప్టెన్ డూప్లెసిస్ అయితే అది ఔటని మ్యాచ్ తర్వాత తెలిసిందన్నాడు. అయినప్పటికీ అది మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందనడం సరికాదని అభిప్రాయపడ్డాడు. 

click me!