అలా అంటుంటే నాకు మండిపోతోంది: రస్సెల్

By telugu teamFirst Published Jun 1, 2019, 12:12 PM IST
Highlights

రసెల్‌ తొలి ఓవర్లో బౌన్సర్‌ను ఫఖర్‌ జమాన్‌ ఆడలేకపోయాడు. అతని హెల్మెట్‌ గ్రిల్‌కు తగిలి బంతి వికెట్లపై పడింది. రెండో ఓవర్లో షార్ట్‌ బంతులను ఆడలేక బాబర్‌ భయపడ్డాడు. 

నాటింగ్‌హామ్ : తనను మీడియం పేసర్ అని అనడంపై ఆండ్య్రూ రస్సెల్ మండిపడుతున్నాడు. తాను మీడియం పేసర్ ను కానని, ఫాస్ట్ బౌలర్ ను అని ఆయన చెబుకున్నాడు.  శుక్రవారం పాకిస్తాన్ తో జరిగిన వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో రసెల్‌ తన బౌలింగుతో ప్రత్యర్థులను భయపెట్టాడు. దాదాపు 146 కిలోమీటర్ల వేగంతో వరుసగా షార్ట్‌ పిచ్‌ బంతులు విసిరాడు.  

రసెల్‌ వేసిన 18 బంతుల్లో 15 బంతులు షార్ట్‌ పిచ్‌వే కావడం గమనార్హం. అతని మూడు ఓవర్ల స్పెల్‌ పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ ను వణికించింది. రసెల్‌ తొలి ఓవర్లో బౌన్సర్‌ను ఫఖర్‌ జమాన్‌ ఆడలేకపోయాడు. అతని హెల్మెట్‌ గ్రిల్‌కు తగిలి బంతి వికెట్లపై పడింది. రెండో ఓవర్లో షార్ట్‌ బంతులను ఆడలేక బాబర్‌ భయపడ్డాడు. 

మెయిడిన్‌గా ముగిసిన మూడో ఓవర్ లో ఎత్తులో వేగంగా దూసుకొచ్చిన బంతిని ఆడలేక సొహైల్‌ వికెట్‌ పారేసుకున్నాడు. 3 ఓవర్లలో కేవలం 4 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు రసెల్.

చాలా మంది తనను ఓ బిగ్‌హిట్టర్‌నని చెబుతుంటారని, వారందరికీ తెలియనిది ఏమిటంటేతాను ఓ ఫాస్ట్‌ బౌలర్‌ను అనే విషయమని మ్యాచ్ అనంతరం రస్సెల్ అన్నాడు. అందరూ తనను తక్కువ అంచనా వేశారని, తనను మీడియం పేసర్‌గా పరిగణిస్తుంటే అసహనం కలిగేదని అన్నాడు. 

తాను బంతిని తీసుకోవడానికి వచ్చినప్పుడు స్క్రీన్‌పై ‘మీడియం పేసర్‌’ అని కనిపించేదని, అప్పుడు తనకు పట్టరాని అగ్రహం ముంచుకొచ్చేదని అన్నాడు. నేను మీడియం పేసర్‌నని ఎవరు చెప్పారని గట్టిగా అరవాలనిపించేదని అన్నాడు.

చాలా ఏళ్లుగా మోకాలి గాయంతోనే ఆడుతున్నానని, కొన్నిసార్లు చాలా ఇబ్బందిగా ఉంటుందని, తాను  ఫ్రొఫెషనల్‌ క్రికెటర్‌ను కాబట్టి మాములేనని అన్నాడు. గాయం నుంచి ఎలా కోలుకోవాలో తనకు తెలుసునని అన్నాడు. 

తర్వాతి మ్యాచ్‌కు ఇంకా ఐదు రోజులున్నట్లుందని, తన గాయం తగ్గడానికి ఈ సమయం సరిపోతుందని అన్నాడు. తనకు మంచి ఫిజియో టీమ్‌, మసాజ్‌ టీమ్‌ ఉందని, వారంతా నా గాయం తగ్గడానికి కృషి చేస్తారని రసెల్‌ అన్నాడు.

click me!