యువరాజ్ సిక్సర్ల సునామీ గుర్తుందా.. నేటి మ్యాచ్‌లో ఉతికి ‘ఆరే’సేది ఎవరు...

By team teluguFirst Published Sep 19, 2020, 3:38 PM IST
Highlights

2007 టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లాండ్, టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన యువరాజ్...

13 ఏళ్లుగా టీ20లో ఫాస్టెస్టు హాఫ్ సెంచరీగా యువీ పేరిటే రికార్డు... నేటి మ్యాచులో యువీ ఇన్నింగ్స్‌ను మరిపించగలరా?

యువరాజ్ సింగ్... భారత క్రికెట్‌లో ఓ స్టార్. విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించే యువరాజ్, బౌలింగ్‌తోనూ మ్యాజిక్ చేయగలడు. అంతేనా వరల్డ్ క్రికెట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్ కూడా. యువరాజ్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే ఇన్నింగ్స్... 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌పై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లతో యువీ విరుచుకుపడిన సునామీ ఇన్నింగ్స్‌యే! 2007 సెప్టెంబర్ 19న జరిగిన ఈ సూపర్ ఇన్నింగ్స్‌కి నేటికి 13 ఏళ్లు.

2007 టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లాండ్, టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్‌లో గంభీర్ 58, వీరేంద్ర సెహ్వాగ్ 68 పరుగులతో రాణించడంతో భారత జట్టు వికెట్ కోల్పోకుండా 136 పరుగులు చేసింది. అయితే రన్‌రేట్ నెమ్మదిగా సాగడంతో భారత జట్టు మహా అయితే 160+ స్కోర్ చేస్తుందని అనుకున్నారంతా.

అయితే క్రీజులోకి బ్యాటింగ్‌కి వచ్చిన యువరాజ్‌ సింగ్‌ని ఇంగ్లాండ్ క్రికెటర్ ఫ్లింటాఫ్ సెడ్జింగ్ చేశాడు. దాంతో ఒక్కసారిగా ఆవేశానికి లోనైన యువీ, తన బ్యాటుతో సమాధానం చెప్పాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19వ ఓవర్‌లో కాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆరు బంతుల్లో వరుసగా ఆరు సిక్సర్లు బాదేశాడు. బ్రాడ్ ఏ బంతి వేసినా దాన్ని బౌండరీ అవతల పడేలా బలంగా కొట్టాడు. ఈ ఓవర్‌కి ముందు 3 ఓవర్లలో 24 పరుగులే ఇచ్చిన బ్రాడ్, 4 ఓవర్లు ముగిసే సరికి 60 పరుగులు సమర్పించుకున్నాడు.

 

What was your reaction when this happened? pic.twitter.com/QBo8C5suVS

— ESPN India (@ESPNIndia)

16 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 58 పరుగులు చేసిన యువరాజ్ (స్టైయిట్ రేట్ 362.5), 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇప్పటికీ టీ20ల్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత ఈరోజు ఐపీఎల్ ప్రారంభం కానుంది. ముంబై, చెన్నై మధ్య జరిగే మ్యాచ్‌లో ఏ బ్యాట్స్‌మెన్ అయినా యువరాజ్ రికార్డును కొట్టగలడేమో చూడాలి... 

click me!