కరోనా vs ఐపీఎల్: గెలిచేదెవరు? నిలిచేదెవరు?

By team teluguFirst Published Sep 19, 2020, 2:53 PM IST
Highlights

కరోనా పరిస్థితులను లెక్కచేయకుండా ఛాలెంజింగ్‌గా ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ... 8 జట్టు సభ్యులు ఒకే చోట చేరడంతో ఏ క్షణమైనా కరోనా మహమ్మారి దాడి చేసే అవకాశం...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ఐపీఎల్ ప్రత్యేక్ష ప్రసారాలు జరగబోతున్నాయంటే ఏ రేంజ్‌లో ఈ లీగ్ విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డుగా గుర్తింపు పొందిన బీసీసీఐ, కరోనా పరిస్థితులను లెక్కచేయకుండా ఛాలెంజింగ్‌గా ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించాలని చూస్తోంది.

దాదాపు 54 రోజుల పాటు సాగే ఈ మెగా టోర్నీకి కరోనా ఏ నిమిషంలో అయినా బ్రేక్ వేయొచ్చు. దాన్ని తట్టుకుని సీజన్ విజయవంతంగా పూర్తిచేయడం ఐపీఎల్ యాజమాన్యానికి పెను సవాల్. అయితే ఇంగ్లాండ్‌లో ఆస్ట్రేలియా టూర్ విజయవంతంగా ముగిసింది. ప్రేక్షకులు లేకుండా సాగిన ఈ క్రికెట్ టోర్నీకి కరోనా ఆటంకాలు కలిగించలేదు. దాంతో ఐపీఎల్ కూడా సజావుగా సాగుతుందని ఆశిస్తున్నారు భారత అభిమానులు.

అయితే ఇంగ్లాండ్, ఆసీస్ మధ్య జరిగింది ద్వైపాక్షిక సిరీస్. ఇరుదేశాలకు చెందిన ప్లేయర్లు మాత్రమే ఉంటారు. కానీ ఐపీఎల్ అలా కాదు, ఇంగ్లాండ్, ఆసీస్ నుంచి 21 మంది ప్లేయర్లు ఐపీఎల్ కోసం దుబాయ్ చేరారు. ఒక్క పాక్ మినహా క్రికెట్ ఆడే అన్ని దేశాల క్రికెటర్లు ఐపీఎల్‌లో పాల్గొంటున్నారు. 8 జట్ల నుంచి దాదాపు 240 మంది ప్లేయర్లు, వారి వ్యక్తిగత సిబ్బంది, సహాయక సిబ్బంది, కోచ్‌లు, ఫిజియో, అంపైర్లు,... ఇలా దాదాపు 400 మందికి పైగా పాల్గొనబోతున్నారు. రెండు నెలల పాటు వీరి కార్యకలాపాలపై పూర్తి నిఘా ఉంచాల్సి ఉంటుంది.

మనతో పోలిస్తే యూఏఈలో కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువ. ఇప్పటిదాకా అక్కడ 83,433 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 403 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అక్కడ కూడా కరోనా ఇంకా పూర్తిగా పోలేదు. ఇప్పటికీ రోజూ 600+ కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆటగాళ్లలో ఒక్కరిలో లక్షణాలు కనిపించినా ఆదాయం కోసం క్రికెటర్ల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ ఐపీఎల్ యాజమాన్యంపై విపరీతమైన విమర్శలు వెల్లువెత్తుతాయి.

ఇలాంటి విపత్కర పరిస్థితులను దాటి టోర్నీ విజయవంతంగా పూర్తి చేయగలడమే చాలా పెద్ద టాస్క్. అయితే ఐపీఎల్ 2020 నిర్వహణను ఓ ఛాలెంజ్‌గా తీసుకున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, దాన్ని ఎలా పూర్తి చేస్తాడో చూడాలి.

click me!