Asia Cup: నాతో మాట్లాడటం నీకు ఓకేనా..? మంజ్రేకర్‌తో జడ్డూ మాటామంతి.. వైరల్ అవుతున్న వీడియో

By Srinivas MFirst Published Aug 29, 2022, 11:22 AM IST
Highlights

India Vs Pakistan:చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఆదివారం ముగిసిన పోరులో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.  

ఇండియా-పాకిస్తాన్ మధ్య దుబాయ్ వేదికగా  ఆదివారం ముగిసిన కీలక పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 148 పరుగుల ఛేదనలో భారత బ్యాటింగ్  లో  రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. 29 బంతులాడిన జడ్డూ.. 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. హార్ధిక్ పాండ్యా తో కలిసి ఐదో వికెట్ కు 52 పరుగులు జోడించి మ్యాచ్ ను భారత్ కంట్రోల్ లోకి తెచ్చాడు. అయితే మ్యాచ్ అనంతరం జడేజా.. కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

మ్యాచ్ అనంరతం మంజ్రేకర్.. రవీంద్ర జడేజాతో మాట్లాడాడు. మాట్లాడటానికి ముందు అతడు జడేజాతో.. ‘జడేజా.. మొదటి ప్రశ్న. నీకు నాతో మాట్లాడటం ఓకేనా..?’ అని అడిగాడు.  దానికి జడ్డూ కూడా నవ్వుతూ.. ‘ఏం పర్లేదు. నాకు ఓకే..’ అంటూ సమాధానం చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. 

అయితే ఈ ఇద్దరూ మాట్లాడుకోవడం నిజంగా వింతే. గతంలో రవీంద్ర జడేజా ఆటతీరుపై విమర్శలు చేసిన మంజ్రేకర్.. జడ్డూతో ట్విటర్ వేదికగా వాదనకు దిగేవాడు. జడేజాతోనే గాక ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే తో కూడా గొడవ కారణంగా..  అతడు స్టార్ స్పోర్ట్స్ కామెంటరీ ప్యానెల్ నుంచి కూడా తప్పుకున్నాడు. అప్పట్నుంచి  అతడు జడేజా గురించి గానీ, హర్షా భోగ్లే గురించి గానీ పబ్లిక్ గా ఏ విధమైన  వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేదు. 

 

Success makes you the bigger person 😄 pic.twitter.com/RhqqGFEL0b

— Nachiket Kher (@NachiketKher)

తాజాగా ఆసియా కప్ లో జడేజా మెరుగ్గా రాణించడంతో అతడిని మంజ్రేకర్ ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. దీంతో మంజ్రేకర్ మొహమాటం లేకుండా జడేజాను ఆ ప్రశ్న అడిగేశాడు. దీనికి జడేజా కూడా నవ్వుతూ సమాధానం చెప్పడంతో ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలిగినట్టయ్యాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

ఇక ఆదివారం నాటి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే..  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో మహ్మద్ రిజ్వాన్ (43), ఇఫ్తికర్ అహ్మద్ (28) రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4, హార్ధిక్ పాండ్యా 3, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీయగా అవేశ్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు. స్వల్పలక్ష్య ఛేదనలో భారత్.. ఆదిలో తడబడింది. తొలి ఓవర్లోనే కెఎల్ రాహుల్ ను  నసీం షా డకౌట్ చేశాడు.  ఆ తర్వాత ఇన్నింగ్స్ ను కోహ్లీ (35) నిలబెట్టాడు. మిడిల్ లో వచ్చిన రవీంద్ర జడేజా (35)తో కలిసి హార్ధిక్ పాండ్యా (33 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ విజయంతో ఆసియా కప్ లో భారత్ బోణీ కొట్టింది. 

click me!