Asia Cup: బదులు తీరింది.. ఉత్కంఠ అదిరింది.. పాక్ పై పోరులో టీమిండియాదే విక్టరీ..

By Srinivas MFirst Published Aug 28, 2022, 11:46 PM IST
Highlights

India vs Pakistan: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్-2022లో భాగంగా పాకిస్తాన్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తడబడినా చివర్లో ధాటిగా ఆడి విజయం సాధించింది.
 

అదే ఉత్కంఠ.. అదే ఉత్సాహం.. బంతి బంతికీ టెన్షన్. ఓవర్ ఓవర్ కూ మారుతున్న సమీకరణాలు.. ఫోర్లు, సిక్సర్లు కొడితే కేరింతలు, వికెట్ పడితే నిట్టూర్పులు.. విజయం ఇరు జట్ల మధ్య దోబూచూలాడుతూనే ఉంది. ఆధిపత్యం చేతులు మారుతూనే ఉంది. అయినా గెలుపుపై ఎవరి నమ్మకం వారిదే.. వెరసి భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే  ఎందుకంత క్రేజ్ ఉంటుందో మరోసారి నిరూపితమైంది. దాయాదుల సమరం ఏడాదికోసారి జరిగినా క్రికెట్ అభిమానులు ఎందుకంత ఇష్టపడతారో మరోసారి క్రికెట్ ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో విజయం భారత్ నే వరించింది. ఈ విజయంతో గతేడాది టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన పరాబవానికి భారత్ బదులు తీర్చుకున్నట్టైంది.

యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్-2022లో భాగంగా పాకిస్తాన్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 19.4 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. ఆధ్యంతం ఆసక్తిగా సాగిన ఈ మ్యాచ్ లో బౌలర్లదే పైచేయి అయినా హార్ధిక్ బంతితో పాటు బ్యాట్ తోనూ రాణించి అసలైన క్రికెట్ మజాను పంచాడు. 

స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ కు తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బంతికే  ఓపెనర్ కెఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. నసీమ్ షా వేసిన తొలి ఓవర్ రెండో బంతిని వికెట్ల మీదకు ఆడుకుని పెవిలియన్ కు చేరాడు.  అదే ఓవర్లో నాలుగో బంతికి వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ (34 బంతుల్లో 35, 3 ఫోర్లు, 1 సిక్సర్) కూడా ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 

రెండో బంతికే ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించున్న కోహ్లీ తర్వాత చెలరేగి ఆడాడు. దహానీ వేసిన  రెండో ఓవర్లో ఫోర్ కొట్టిన అతడు.. రౌఫ్ వేసిన నాలుగో ఓవర్లో సిక్సర్ బాదాడు. రోహిత్ శర్మ (18 బంతుల్లో 12) నెమ్మదిగా ఆడినా కోహ్లీ దూకుడు కొనసాగించాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 49 పరుగులు జోడించారు. కుదురుకుంటున్న ఈ జోడీని మహ్మద్ నవాజ్ విడదీశాడు.  నవాజ్ వేసిన 8వ ఓవర్ నాలుగో బంతిని సిక్సర్ బాదిన హిట్ మ్యాన్.. అదే ఓవర్లో  ఆరో బంతికి ఇఫ్తికర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నవాజ్ తన తర్వాతి ఓవర్లో.. ధాటిగా ఆడుతున్న కోహ్లీనీ ఔట్ చేశాడు. దీంతో భారత్ కష్టాల్లో పడింది. 

జడ్డూ, పాండ్యా సూపర్ ఇన్నింగ్స్..

వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (29 బంతుల్లో 35, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (18) లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు  36 పరుగులు జోడించారు.  సాఫీగా సాగుతున్న ఈ జోడీని నసీమ్ షా విడదీశాడు. అతడు వేసిన 15వ  ఓవర్లో.. సూర్య క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

ఆ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన హార్ధిక్ పాండ్యా (17 బంతుల్లో 33 నాటౌట్.. 4 పోర్లు, 1 సిక్సర్).. స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. జడేజా-పాండ్యాలు వికెట్ల మధ్య చురుకుగా కదిలారు. చివరి నాలుగు ఓవర్లలో 41 పరుగులు చేయల్సి ఉండగా హరీస్ రౌఫ్ వేసిన 17వ ఓవర్లో 9 పరుగులే వచ్చాయి. సింగిల్స్, డబుల్స్ తో పనికాదనుకున్న ఈ జోడీ హిట్టింగ్ కు దిగింది. నసీమ్ షా వేసిన 18వ ఓవర్లో తొలి బంతిని ఫోర్ కొట్టిన జడ్డూ.. ఐదో బంతికి సిక్సర్ బాదాడు.  ఇక హరీస్ రౌఫ్ వేసిన 19వ ఓవర్లో.. పాండ్యా మూడు ఫోర్లు బాది భారత్ ను విజయానికి చేరువ చేశాడు. 

ఇక విజయం ఖాయమే అనుకుంటున్న తరుణంలో చివరి ఓవర్ తొలి బంతికి జడేజాను నవాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కానీ పాండ్యా మాత్రం ఎలాంటి సంచలనాలను తావివ్వకుండా పనిని  పూర్తి చేశాడు. 19 ఓవర్లో నాలుగో బంతికి హార్ధిక్ పాండ్యా సిక్సర్ కొట్టి భారత్ కు విజయం అందించాడు.  

పాక్ బౌలర్లలో నసీమ్ షా రెండు వికెట్లు తీయగా.., మహ్మద్ నవాజ్ మూడు  వికెట్లు తీశాడు. కాలికి గాయమైనా, నడవడానికీ ఇబ్బంది పడుతున్నా  నసీమ్ షా కుంటుతూ అయినా చివరి ఓవర్ వేసేందుకు  పడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన  పాకిస్తాన్.. 19.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో మహ్మద్ రిజ్వాన్ (43), ఇఫ్తికర్ అహ్మద్ (28) రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్.. 4 ఓవర్లలో 26  పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. హార్ధిక్ పాండ్యా నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.అర్ష్‌దీప్ 2 వికెట్లు తీయగా అవేశ్ ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. 

click me!