
వెస్టిండీస్‌తో జరుగుతున్న డొమినికా టెస్టులో టీమిండియా పూర్తి ఆధిక్యం కొనసాగిస్తోంది. తొలి రోజు రెండున్నర సెషన్లలోనే విండీస్‌ని ఆలౌట్ చేశారు భారత బౌలర్లు. రెండో రోజు భారత బ్యాటర్ల హవా నడించింది.. రెండో రోజు పూర్తిగా 90 ఓవర్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా, 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది.
తొలి టెస్టులో ఆరంగ్రేటం చేసిన యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీలతో చెలరేగడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 113 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 312 పరుగుల భారీ స్కోరు చేసింది టీమిండియా. యశస్వి జైస్వాల్ 350 బంతుల్లో 14 ఫోర్లతో 143 పరుగులు చేసి క్రీజులో ఉంటే విరాట్ కోహ్లీ 96 బంతుల్లో ఒకే ఒక్క బౌండరీతో 36 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కి 72 పరుగుల అజేయ భాగస్వామ్యం జోడించారు.
సెంచరీ పూర్తయిన తర్వాత రోహిత్ శర్మ, ఆరంగ్రేటం విండీస్ ఆటగాడు అలిక్ అథనజే బౌలింగ్‌లో జోషువా డి సిల్వకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 221 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేసిన రోహిత్ శర్మని అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూకి వెళ్లిన విండీస్‌కి ఫలితం దక్కింది.
యశస్వి జైస్వాల్ కోసం వన్‌డౌన్ బ్యాటింగ్ పొజిషన్‌కి మారిన శుబ్‌మన్ గిల్ 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసి జోమెల్ వర్రీకాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ ఆడిన మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ తీసుకుంది. అయితే టీవీ రిప్లై బంతి వికెట్లను మిస్ కావడంతో కోహ్లీకి లక్ కలసి వచ్చింది.
104 బంతుల్లో 7 ఫోర్లతో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్న యశస్వి జైస్వాల్, 215 బంతుల్లో 11 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరంగ్రేటం టెస్టులో సెంచరీ చేసిన మూడో భారత ఓపెనర్‌గా నిలిచాడు యశస్వి జైస్వాల్. ఇంతకుముందు శిఖర్ ధావన్, 2013లో ఆస్ట్రేలియాపై, పృథ్వీ షా, వెస్టిండీస్‌పై 2018లో సెంచరీలు చేశారు. విదేశాల్లో టెస్టు ఆరంగ్రేటం చేసి, సెంచరీ బాదిన మొట్టమొదటి భారత ఓపెనర్‌గా నిలిచాడు యశస్వి జైస్వాల్.. .
టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలో ఓపెనర్లు, ప్రత్యర్థి జట్టు స్కోరు కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం జోడించడం ఇదే తొలిసారి. వెస్టిండీస్‌లో టీమిండియాకి ఇదే అత్యధిక మొదటి వికెట్ భాగస్వామ్యం కూడా.
8 ఏళ్ల తర్వాత విదేశాల్లో భారత ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇంతకుముందు 2015 బంగ్లా టూర్‌లో మురళీ విజయ్, శిఖర్ ధావన్ సెంచరీలు చేసుకున్నారు. ఓవరాల్‌గా విదేశాల్లో భారత ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు చేసుకోవడం ఇది ఆరోసారి.