
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి రోజు టీమిండియా మంచి ఆటతీరును కనబరించింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 336 పరుగు సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో యశస్వి అద్భుత సెంచరీని సాధించాడు. లీడ్స్‌లో సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్‌గా నిలిచి, దాదాపు 58 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డును బదద్దలు కొట్టాడు.
1967లో భారత దిగ్గజ బ్యాటర్ ఫరూక్ ఇంజనీర్ లీడ్స్‌లో 87 పరుగులు చేసిన తరువాత, ఏ భారత ఓపెనర్ కూడా ఆ మైదానంలో సెంచరీ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు యశస్వి 144 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో తన ఐదో టెస్టు సెంచరీని నమోదు చేస్తూ ఆ రికార్డును అధిగమించాడు.
టెస్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జైస్వాల్, కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించాడు. రాహుల్ అవుట్ అయిన తర్వాత అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ డకౌట్ అయ్యినా, జైస్వాల్ కెప్టెన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. 96 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన జైస్వాల్, ఆ తర్వాత కేవలం 48 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
ఈ మ్యాచ్ యశస్వికి 20వ టెస్టు మ్యాచ్. విశేషం ఏంటంటే – ఈ 20 టెస్టులను 20 వేర్వేరు వేదికల్లో ఆడిన తొలి భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, భారత్, ఇప్పుడు ఇంగ్లండ్ వేదికలతో సహా ప్రతి మ్యాచ్ వేర్వేరు స్టేడియంలో ఆడటం మరో విశేషం. లీడ్స్ వేదికను కూడా జోడించడంతో, ఈ ఘనతను సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.