
శనివారం మొదలైన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఏకపక్షంగా సాగిన తొలి రెండు మ్యాచ్ లకు భిన్నంగా యూపీ వారియర్స్ - గుజరాత్ జెయింట్స్ ఆఖరి బంతి వరకు విజయం ఇరు జట్ల దోబూచులాడింది. గెలుపు ఖాయమనుకున్న గుజరాత్ కు గ్రేస్ హరీస్ (26 బంతుల్లో 59 నాటౌట్, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చివర్లో చుక్కలు చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించి తర్వాత ప్రత్యర్థిని కట్టడి చేద్దామన్న వ్యూహాన్ని ఛేదిస్తూ యూపీ వారియర్స్ కు బంపర్ విక్టరీని అందించింది. హరీస్ సూపర్ ఇన్నింగ్స్ తో గుజరాత్ నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని యూపీ వారియర్స్.. మరో బంతి మిగిలుండగానే అందుకుంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ను గుజరాత్ చేజేతులా పోగొట్టుకుంది.
మోస్తారు లక్ష్య ఛేదనలో యూపీ వారియర్స్ కు ఆది నుంచే కష్టాలు ఎదురయ్యాయి. ఆ జట్టు కెప్టెన్ అలీస్సా హీలి (7) తో పాటు మరో ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ (5), తహిలా మెక్‌గ్రాత్ (0)లు విఫలమయ్యారు 20 పరుగులకే ఆ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ మూడు వికెట్లూ కిమ్ గార్త్ కే పడ్డాయి.
నవ్‌గిరె అదిరె..
20 కే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో యూపీని కిరణ్ నవ్‌గిరె ఆదుకుంది. దీప్తి శర్మ (11) తో కలిసి నాలుగో వికెట్ కు 66 పరుగులు జోడించింది. తనూజా కన్వర్ వేసిన ఆరో ఓవర్లో భారీ సిక్సర్ బాదిన ఆమె.. క్రమం తప్పకుండా ఓవర్ కు ఒక బౌండరీ అయినా బాదింది. స్నేహ్ రాణా బౌలింగ్ లో భారీ సిక్సర్ తో 40లలోకి వచ్చిన నవ్‌గిరె.. (43 బంతుల్లో 53, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మాన్సి జోషి వేసిన 12వ ఓవర్ మూడో బంతికి రెండు పరుగులు తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.
వికెట్ల పతనం..
నవ్‌గిరె అర్థ సెంచరీ పూర్తయ్యేటప్పటికీ యూపీ స్కోరు 84 పరుగులు మాత్రమే. ఆమె క్రీజులో ఉంటే కొట్టాల్సిన టార్గెట్ పెద్దదేమీ కాదు. కానీ మాన్సి జోషి వేసిన 12వ ఓవర్లోనే చివరి బంతికి దీప్తి శర్మ క్లీన్ బౌల్డ్ అయింది. ఆ తర్వాత ఓవర్లో కిమ్ గార్త్.. నవ్‌గిరె ను ఔట్ చేసింది. మరుసటి బంతికే సిమ్రన్ షేక్ (0) ను ఆమె క్లీన్ బౌల్డ్ చేసింది. ఈ మ్యాచ్ లో గార్త్ కు ఇది ఐదో వికెట్ కావడం గమనార్హం. రెండు ఓవర్ల వ్యవధిలోనే ఆ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయి కోలుకోలేని స్థితిలోకి వెళ్లింది.
హరీస్ అదుర్స్..
105కే ఏడు వికెట్లు కోల్పోయిన యూపీ ఇన్నింగ్స్ ను గ్రేస్ హరిస్ నడిపించింది. వికెట్ల పతనాన్ని అడ్డుకోవడమే గాక చివర్లో మెరుపులు మెరిపించింది. తనూజా కన్వర్ వేసిన 17వ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన ఆమె.. తర్వాత కిమ్ గార్త్ వేసిన 18వ ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు బాదింది. ఆ ఓవర్లో ఏకంగా 20 పరుగులొచ్చాయి. ఆ తర్వాత గార్డ్‌నర్ బౌలింగ్ లో ఎక్లిస్టోన్ భారీ సిక్సర్ బాదింది. చివరి ఓవర్ లో 19 పరుగులు అవసరముండగా హరీస్ తొలి బంతికే సిక్సర్ బాదింది. రెండో బాల్ వైడ్. తర్వాత రెండు పరుగులొచ్చాయి. మూడో బాల్ ఫోర్. నాలుగో బాల్ మళ్లీ వైడ్. సమీకరణం మూడు బంతుల్లో ఐదు పరుగులుగా మారింది. నాలుగో బంతికి ఫీల్డింగ్ మిస్ తో బౌండరీ. ఐదో బంతికి సిక్సర్. అంతే యూపీ థ్రిల్లింగ్ విక్టరీ.. మరో బంతి మిగిలుండగానే యూపీకి తొలి విజయం, గుజరాత్ కు రెండో పరాజయం.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టులో హర్లీన్ డియోల్ (46) హేమలత (25), సబ్బినేని మేఘన (24) రాణించారు.