వుమెన్స్ టీ20 ఛాలెంజ్ 2022 విజేత సూపర్ నోవాస్... ఫైనల్ మ్యాచ్‌లో పోరాడి ఓడిన వెలాసిటీ...

Published : May 28, 2022, 11:13 PM ISTUpdated : May 28, 2022, 11:17 PM IST
వుమెన్స్ టీ20 ఛాలెంజ్ 2022 విజేత సూపర్ నోవాస్... ఫైనల్ మ్యాచ్‌లో పోరాడి ఓడిన వెలాసిటీ...

సారాంశం

Women T20 Challenge 2022 విజేతగా సూపర్ నోవాస్... నాలుగు సీజన్లలో మూడోసారి టైటిల్ గెలిచిన ‘సూపర్’ నోవాస్... వెలాసిటీకి మరోసారి తప్పని నిరాశ... 

వుమెన్స్ టీ20 ఛాలెంజ్ 2022 ఫైనల్, ఐపీఎల్ ఫైనల్‌ని తలపించింది. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని సూపర్ నోవాస్ ముచ్చటగా మూడోసారి టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో వెలాసిటీని 4 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్న సూపర్ నోవాస్, నాలుగో సీజన్‌లో మూడోసారి టైటిల్ సాధించింది. 2018, 2019 సీజన్లలో టైటిల్ గెలిచిన సూపర్ నోవాస్, గత సీజన్‌లో ఫైనల్ చేరినా ట్రైయిల్ బ్లేజర్స్ చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది... సీజన్ గ్యాప్‌తో మూడో టైటిల్ గెలిచి, వుమెన్స్ టీ20 ఛాలెంజ్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా నిలిచిపోనుంది..  మొట్టమొదటి టైటిల్ గెలవాలని ఆశపడిన వెలాసిటీ, భారీ స్కోరింగ్ గేమ్‌లో ఆఖరి వరకూ పోరాడినా విజయం సాధించలేకపోయింది.

వచ్చే ఏడాది వుమెన్స్ ఐపీఎల్ ప్రారంభం కాబోతుండడంతో వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌కి ఇదే ఆఖరి సీజన్. ఫైనల్ మ్యాచ్‌లో 166 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన వెలాసిటీ, ఆరంభంలో ఏ దశలోనూ లక్ష్యంవైపు సాగుతున్నట్టు కనిపించలేదు. అయితే ఆఖర్లో లారా హాఫ్ సెంచరీతో పోరాడి ఓడింది. 8 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన యంగ్ బ్యాటర్ షెఫాలీ వర్మ, డియాండ్రా డాటిన్ బౌలింగ్‌లో తానియా భాటియాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది.

9 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసి యషికా భాటియా, ఎక్లేస్టోన్‌ బౌలింగ్‌లో ఆమెకే క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా గత మ్యాచ్‌లో వీరబాదుడు బాదిన కిరణ్ నవ్‌గిరే 13 బంతులాడిన పరుగులేమీ చేయలేక ఎక్లేస్టోన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది... 

నత్తకరన్ చాంతమ్ 6, కెప్టెన్ దీప్తి శర్మ 2 పరుగులకు అవుట్ కాగా స్నేహ్ రాణా 15 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి ఆలెనా కింగ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యింది. ఆ తర్వాతి బంతికే రాధా యాదవ్ కూడా గోల్డెన్ డకౌట్ కావడం అప్పటికే కావాల్సిన రన్ రేట్ 15 దాటేయడంతో వెలాసిటీ ఓటమి ఖాయమనుకున్నారంతా... అయితే అప్పుడే అసలు సిసలైన మజా ఆరంభమైంది. 

డియాండ్రా డాటిన్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన కేట్ క్రాస్ 7 బంతుల్లో 13 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో ఒంటరి పోరాటం చేసిన లారా వాల్వర్ట్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది... 

ఆఖరి 2 ఓవర్లలో 34 పరుగులు కావాల్సిన దశలో లారా ఓ ఫోర్ బాదగా సిమ్రాన్ బహదూర్ వరుసగా మూడు ఫోర్లు బాదింది. దీంతో 19వ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో 17 కావాల్సి రావడంతో ఉత్కంఠ రేగింది.  20వ ఓవర్ మొదటి బంతికి లారా సిక్సర్ బాదడంతో వెలాసిటీ విజయానికి ఆఖరి 5 బంతుల్లో 11 పరుగులు కావాల్సి వచ్చింది. రెండో బంతికి లారా సింగిల్ తీయగా మూడో బంతికి ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ తీసుకుంది సూపర్ నోవాస్ టీమ్...

టీవీ రిప్లైలో నాటైట్‌గా తేలగా లెగ్ బైస్ రూపంలో ఓ పరుగు వచ్చింది. నాలుగో బంతికి లారా 2 పరుగులు తీయగా ఐదో బంతికి 1 పరుగు మాత్రమే వచ్చింది. దీంతో ఆఖరి బంతికి వెలాసిటీ విజయానికి సిక్సర్ కావాల్సి వచ్చింది. అయితే సిమ్రాన్ సింగిల్ మాత్రమే తీయగలగడంతో 4 పరుగుల తేడాతో వెలాసిటీ ఓడింది. సిమ్రాన్ బహదూర్ 10 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేయగా లారా 40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.

అంతకుముందు టాస్ గెలిచిన వెలాసిటీ కెప్టెన్ దీప్తి శర్మ, ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 165 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది...

సూపర్ నోవాస్ టీమ్‌కి అదిరిపోయే ఆరంభాన్ని అందించారు ఓపెనర్లు ప్రియా పూనియా, డియాండ్రా డాటిన్. తొలి వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత ప్రియా అవుటైంది. 29 బంతుల్లో 2 సిక్సర్లతో 28 పరుగులు చేసిన ప్రియా పూనియా, సిమ్రన్ బహదూర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది...

ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది డియాండ్రా డాటిన్. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న డియాండ్రా, వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన ఫారిన్ ప్లేయర్‌గా నిలిచింది...

ఓవరాల్‌గా డియాండ్రాది నాలుగో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ఇంతకుముందు కిరన్ నవ్‌వైర్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదగా, షెఫాలీ వర్మ 30 బంతుల్లో, జెమీమా రోడ్రిగ్స్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశారు. 44 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 62 పరుగులు చేసిన డియాండ్రా డాటిన్, దీప్తి శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ చేశాడు.. 

పూజా వస్త్రాకర్ 5 బంతుల్లో 5 పరుగులు చేయగా సోఫీ ఎక్లేస్టోన్ 2, సూనీ లూజ్ 3, హర్లీన్ డియోల్ 7 పరుగులు చేసి అవుట్ కాగా హర్మన్‌ప్రీత్ కౌర్ 29 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించింది.  

హాఫ్ సెంచరీకి చేరువైన హర్మన్‌ప్రీత్ కౌర్‌, కేట్ క్రాస్ బౌలింగ్‌లో షెఫాలీ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుటైంది. ఈ సీజన్‌లో 150 పరుగులు పూర్తి చేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్, ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి బ్యాటర్‌గా నిలిచింది. ఇంతకుముందు 2019లో జెమీమా రోడ్రిగ్స్ చేసిన 123 పరుగులే వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌ ఓ సీజన్‌లో అత్యధిక స్కోరుగా ఉంది...

 డిఫెండింగ్ ఛాంపియన్ ట్రైయిల్ బ్లేజర్స్ జట్టు నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది.

PREV
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?