WI vs IND: క్లీన్ స్వీప్‌పై కన్నేసిన భారత్.. పరువు కోసం విండీస్.. మూడో వన్డేలో టాస్ నెగ్గిన ధావన్

Published : Jul 27, 2022, 06:43 PM IST
WI vs IND: క్లీన్ స్వీప్‌పై కన్నేసిన భారత్.. పరువు కోసం విండీస్.. మూడో వన్డేలో టాస్ నెగ్గిన ధావన్

సారాంశం

WI vs IND ODI: వెస్టిండీస్ పర్యటనలో  వరుసగా రెండు వన్డేలు గెలిచి జోరుమీదున్న టీమిండియా.. మూడో మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్నది. మరోవైపు ఈ మ్యాచ్ లో అయినా నెగ్గాలని విండీస్ ఆరాటపడుతున్నది.   

ఇటీవలే ముగిసిన రెండో వన్డేలో ఓడుతుందనుకున్న మ్యాచ్ ను గెలుచుకుని ఏకంగా సిరీస్ ఒడిసిపట్టుకున్న భారత్.. బుధవారం మూడో వన్డే సైతం నెగ్గి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని ఆశిస్తున్నది. మరోవైపు రెండు మ్యాచుల్లోనూ గెలిచే అవకాశం వచ్చినా ఆఖరి నిమిషంలో  ఓడిన కరేబియన్ జట్టు.. ఈ వన్డేలో అయినా విజయం సాధించి సిరీస్ లో భారత్ ఆధిక్యాన్ని తగ్గించాలని  చూస్తున్నది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య పోర్ట్ ఆఫ్  స్పెయిన్ లోని క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత్ టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ లో భారత్... అవేశ్ ఖాన్ స్థానంలో ప్రసిధ్ కృష్ణను తుదిజట్టులోకి చేర్చింది. విండీస్ జట్టులో మూడు మార్పులు జరిగాయి. జేసన్ హోల్డర్, కీమో పాల్, కీసీ కార్టీ తుది జట్టుతో కలిశారు.  

ఈ సిరీస్ లో రెండు వన్డేలలో భారత బ్యాటర్లు ఆశించిన స్థాయిలోనే రాణించారు. తొలి వన్డేలో శుభమన్ గిల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ మెరుగ్గా ఆడగా.. రెండో వన్డేలో గిల్, అయ్యర్, సంజూ శాంసన్, దీపక్ హుడా లు రాణించారు. రెండో మ్యాచ్ లో అక్షర్ పటేల్ ఆటే హైలైట్ గా మారింది.  మొత్తంగా చూస్తే భారత్ బ్యాటింగ్ లో ఏదైనా వెలితి ఉంటే అది సూర్యకుమార్ యాదవే. అతడు కూడా ఈ మ్యాచ్ లో బ్యాట్ ఝుళిపిస్తే భారత్ కు తిరుగుండదు. 

బ్యాటింగ్ లో ఫర్వాలేదనపిస్తున్నా బౌలింగ్ లో మనోళ్లు తేలిపోతున్నారు. వరుసగా రెండు వన్డేలలో విండీస్ బ్యాటర్లు 300 ప్లస్ స్కోరు  చేశారు. రెండో వన్డేలో అరంగేట్రం చేసిన అవేశ్ ఖాన్  ఆకట్టుకోలేదు. దీంతో మూడో వన్డేలో భారత్ ప్రసిధ్ కు అవకాశమిచ్చింది.  ఇక  సిరాజ్, శార్దూల్ కూడా మరింత మెరుగ్గా బౌలింగ్ చేస్తే విండీస్ కు కష్టాలు తప్పవు. స్పిన్నర్లలో చాహల్, అక్షర్ పటేల్ లు తమదైన మార్కు చూపించాల్సి ఉంది. 

విండీస్ విషయానికొస్తే ఓపెనర్లు షై హోప్,  కైల్ మేయర్స్ తో పాటు బ్రూక్స్, బ్రాండన్ కింగ్, పూరన్ లు మంచి టచ్ లో ఉన్నారు. వీరిని అడ్డుకోకుంటే ఆ జట్టు మరోసారి 300 ప్లస్ స్కోరు చేస్తుందనడంలో సందేహం లేదు. బౌలింగ్ లో ఆ జట్టు అల్జారీ జోసెఫ్,  అకీల్ హోసెన్, షెపర్డ్, సీల్స్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నా వాళ్లు   స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. 

తుది జట్లు : 

ఇండియా : శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్,  శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్,  సంజూ శాంసన్, దీపక్ హుడా,  అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్,  మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిధ్ కృష్ణ

వెస్టిండీస్ : షై హోప్, కైల్ మేయర్స్, షమ్రా బ్రూక్స్, బ్రాండన్ కింగ్, కీసీ కార్టీ, నికోలస్ పూరన్ (కెప్టెన్), అకీల్ హోసెన్, జేసన్ హెల్డర్, కీమో పాల్, జైడన్ సీల్స్, హెడెన్ వాల్ష్ 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ