
వెస్టిండీస్ తో తొలి టీ20 ఆడుతున్న భారత జట్టు బ్యాటింగ్ లో తడబడింది. కెప్టెన్ రోహిత్ శర్మ (44 బంతుల్లో 64, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో మెరిసిన శ్రేయాస్ అయ్యర్.. ఈ మ్యాచ్ లో డకౌట్ కాగా, ఓపెనర్ గా వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడినా భారీ స్కోరు చేయలేదు. పంత్, హార్ధిక్ పాండ్యాలు విఫలమయ్యారు. ఆఖర్లో దినేశ్ కార్తీక్ మెరుపులతో టీమిండియా.. విండీస్ ముందు భారీ టార్గెట్ ను నిలపింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన భారత జట్టు.. ఈసారి కొత్త ఓపెనింగ్ జోడీతో క్రీజులోకి అడుగుపెట్టింది. రోహిత్ శర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 24, 3 ఫోర్లు, 1 సిక్సర్) ఇన్నింగ్స్ ఆరంభించాడు. మెక్‌కాయ్ వేసిన తొలి ఓవర్లో బౌండరీ ద్వారా ఖాతా తెరిచిన సూర్య.. ఆ తర్వాత అల్జారీ జోసెఫ్ వేసిన నాలుగో ఓవర్లో 6, 4, 4తో చెలరేగాడు. అయితే అదే ఊపును కొనసాగించలేకపోయాడు.
పది పరుగుల వద్ద ఔటయ్యే అవకాశం నుంచి తప్పించుకున్న సూర్య.. అకీల్ హోసెన్ వేసిన వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో నాలుగో బంతికి హోల్డర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (0) డకౌటయ్యాడు. రిషభ్ పంత్ (14) తో జతకలిసిన హిట్‌మ్యాన్.. స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ కీమో పాల్ వేసిన పదో ఓవర్లో మూడు బౌండరీలు బాదారు. వరుసగా రెండు ఫోర్లు కొట్టాక అదే ఓవర్లో ఆఖరి బంతికి పంత్.. అకీల్ హోసెన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఇక అల్జారీ జోసెఫ్ వేసిన 12వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ. కానీ అదే ఓవర్లో ఐదో బంతికి హార్ధిక్ పాండ్యా (1) మెక్‌కాయ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. స్కోరును పెంచే క్రమంలో రోహిత్.. హోల్డర్ వేసిన 15వ ఓవర్లో ఐదో బంతికి హెట్మెయర్ చేతికి చిక్కాడు. ఆ వెంటనే జడేజా (13) కూడా ఔటయ్యాడు.
చివర్లో దినేశ్ కార్తీక్ (19 బంతుల్లో 41, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), అశ్విన్ (10 బంతుల్లో 13, 1 సిక్సర్) లు మెరుపులు మెరిపించారు. హోల్డర్ వేసిన 19వ ఓవర్లో అశ్విన్ రెండు భారీ సిక్సర్లు బాదగా కార్తీక్ 6, 4 కొట్టాడు. ఇక మెక్‌కాయ్ వేసిన 20వ ఓవర్లో కార్తీక్ 6,4,4 తో టీమిండియా స్కోరును 190 కు చేర్చాడు.
విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు తీయగా అకీల్ హోసెన్, కీమో పాల్, హెల్డర్, మెక్‌కామ్ లు తలో వికెట్ పడగొట్టారు.