CWG 2022: కంగారు పడ్డా కంగారూలదే విజయం.. టీమిండియాకు నిరాశ

Published : Jul 29, 2022, 06:44 PM IST
CWG 2022: కంగారు పడ్డా కంగారూలదే విజయం.. టీమిండియాకు నిరాశ

సారాంశం

INDW vs AUSW: కామన్వెల్త్ గేమ్స్-2022 మహిళల క్రికెట్ లో తొలి విజయం ఆస్ట్రేలియాకే దక్కింది.  భారత పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ అద్భుత స్పెల్ తో రాణించినా మిగతా బౌలర్లు విఫలం కావడంతో మ్యాచ్ భారత్ చేజారింది. 

కామన్వెల్త్ క్రీడలలో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్ లో తొలి మ్యాచ్ ను ఆసీస్ గెలుచుకుంది. భారత్ తో ఆధ్యంతం ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్ లో ఆస్టేలియా జట్టు.. 3 వికెట్ల తేడాతో ఇండియాను ఓడించింది. భారత్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని  ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి మరో 6 బంతులు మిగిలుండగానే  ఛేదించింది.  భారత బౌలర్లలో రేణుకాసింగ్ ఠాకూర్ తొలి 4 ఓవర్లలో నాలుగు వికెట్లతో చెలరేగినా మిగిలిన బౌలర్లు భారీగా పరుగులిచ్చుకోవడంతో  ఆసీస్ ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియా తరఫున ఆష్లే గార్డ్‌నర్ (35 బంతుల్లో  52 నాటౌట్, 9 ఫోర్లు) చెలరేగి ఆడి భారత్ నుంచి మ్యాచ్ ను దూరం చేసింది. 

155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన ఆసీస్.. రెండో బంతికే తొలి వికెట్ కోల్పోయింది. తన తొలి ఓవర్లో రేణుకా.. హీలీ (0) ని ఔట్ చేసి ఆసీస్ కు తొలి షాక్ ఇచ్చింది. రెండో ఓవర్లో మేఘనా సింగ్ 13 పరగులిచ్చింది. 

ఇక తన రెండో ఓవర్లో రేణుకా.. తొలి బంతికి  వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ మెగ్ లానింగ్ (8) ను  ఔట్ చేసింది. లానింగ్.. రాధా యాదవ్ కు క్యాచ్ ఇచ్చింది. అదే ఓవర్లో ఐదో బంతికి  మూనీ (10) కూడా బౌల్డ్ అయింది.  

కాగా వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో క్రీజులోకి వచ్చిన మెక్‌గ్రాత్ (14, 3 ఫోర్లు).. గైక్వాడ్ వేసిన నాలుగో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి ధాటిగా ఆడేందుకు యత్నించింది. కానీ రేణుకా తర్వాతి ఓవర్లో ఆమె ఆటనూ కట్టించింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ తొలి బంతికి ఆమె..  మెక్‌గ్రాత్ ను బౌల్డ్ చేసింది. 

గార్డ్‌నర్ పోరాటం.. భారత్ కు విజయం దూరం.. 

ఇన్నింగ్స్  8వ ఓవర్ వేసిన దీప్తి శర్మ.. హేన్స్ (9) ను డగౌట్ కు పంపింది. దీంతో  ఆసీస్ సగం వికెట్లు కోల్పోయింది. ఆ క్రమంలో గ్రేస్ హారిస్ (20 బంతులలో 37, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), గార్డ్‌నర్  ల జోడీ భారత్ ను కాసేపు భయపట్టింది.  ఆరో వికెట్ కు ఈ ఇద్దరూ 51 పరుగులు జోడించారు. ప్రమాదరకంగా పరిణమిస్తున్న ఈ జోడీని మేఘనా సింగ్ విడదీసింది. ఆమె వేసిన 12 ఓవర్ చివరిబంతికి భారీ షాట్ ఆడింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పరుగెత్తుకుంటూ వచ్చి అద్భుత క్యాచ్ అందుకోవడంతో హారిస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత వచ్చిన జొనసేన్ ను 14వ ఓవర్లో దీప్తి శర్మ తన బౌలింగ్ లోనే క్యాచ్ అందుకుని పెవిలియన్ కు పంపింది. 

 

క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా  గార్డ్‌నర్ మాత్రం పోరాటం ఆపలేదు. రాధా యాదవ్ వేసిన 16వ ఓవర్లో బౌండరీ బాదింది. మరోవైపు అలన కింగ్ (15 బంతుల్లో 18 నాటౌట్, 3 ఫోర్లు) మేఘనా సింగ్ వేసిన  17వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు  కొట్టింది. అదే ఓవర్లో చివరిబంతికి గార్డ్‌నర్.. బంతిని బౌండరీకి పంపింది. అదే జోరు కొనసాగించిన ఈ ఇద్దరూ తర్వాత రాధా యాదవ్ బౌలింగ్ లో రెండు, దీప్తి శర్మ బౌలింగ్ లోనూ రెండు బౌండరీలు బాది  ఆసీస్ కు విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో రేణుకా నాలుగు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ 2, మేఘనా సింగ్ 1 వికెట్ తీసింది. భారత్ తమ తదుపరి మ్యాచ్ ఈనెల 31న  పాకిస్తాన్ తో ఆడనున్నది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: టీమిండియాకు తలనొప్పిగా మారిన స్టార్ ప్లేయర్ !
IND vs SA : టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలివే.. గంభీర్ దెబ్బ !