
వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన భారత్ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ధావన్, శుభమన్ గిల్ లు హాఫ్ సెంచరీలతో మెరవడంతో భారత్ భారీ స్కోరుపై కన్నేసింది. అయితే 24 ఓవర్ల తర్వాత ఆటకు వర్షం అంతరాయం కల్గించింది. ప్రస్తుతం 24 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు.. ధావన్ (74 బంతుల్లో 58, 7 ఫోర్లు) వికెట్ నష్టపోయి 115 పరుగులు చేసింది. గిల్ (65 బంతుల్లో 51 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయాస్ అయ్యర్ (6 బంతుల్లో 2 నాటౌట్) ఆడుతున్నారు.
తొలుత బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియాకు ఓపెనర్ శిఖర్ ధావన్, శుభమన్ గిల్ లు శుభారంభం అందించారు. హోల్డర్ వేసిన తొలి ఓవర్లో ఫోర్ తో ఖాతా తెరిచాడు ధావన్. గిల్ కూడా సీల్స్ వేసిన రెండో ఓవర్లో ఫోర్ తోనే ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఇద్దరూ కలిసి విండీస్ పేసర్లను సమర్థంగా ఎదుర్కున్నారు.
సింగిల్స్ తీస్తూ మధ్యలో వీలు చిక్కినప్పుడు ఫోర్లు కొట్టిన ఈ జోడీ 10 ఓవర్లలో 45 పరుగులు చేసింది. అయితే రన్ రేట్ మరీ తక్కువగా ఉండటంతో ధావన్.. హోల్డర్ వేసిన 11వ ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. హెడెన్ వాల్ష్ వేసిన 15వ ఓవర్లో గిల్.. 6, 4 కొట్టాడు. కీమో పాల్ వేసిన 18వ ఓవర్లో చివరిబంతికి డబుల్ తీసిన ధావన్ కెరీర్ లో 37వ అర్థ సెంచరీ చేసుకున్నాడు. ఈ సిరీస్ లో అతడికి ఇది రెండో హాఫ్ సెంచరీ.
19వ ఓవర్లో భారత స్కోరు వంద పరుగులు చేరింది. ఇదే ఊపులో గిల్ కూడా 21వ ఓవర్లో చివరి బంతికి సింగిల్ తీసి రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే తర్వాత హెడెన్ వాల్ష్ వేసిన 23వ ఓవర్లో ధావన్ నికోలస్ పూరన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ధావన్ నిష్క్రమించిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. అతడు వచ్చాక రెండు ఓవర్ల తర్వాత ఆటకు వరుణుడు అంతరాయం కల్పించాడు. ప్రస్తుతం 24 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా.. 1 వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది.