IPL: దేశాన్ని కూడా కాదని.. విదేశీ క్రికెటర్లకు ఐపీఎల్ మీద ఎందుకంత మోజు..?

Published : Feb 22, 2022, 02:04 PM IST
IPL: దేశాన్ని కూడా కాదని.. విదేశీ క్రికెటర్లకు ఐపీఎల్ మీద ఎందుకంత మోజు..?

సారాంశం

IPL 2022: రెండు నెలల పాటు తమ దేశంతో సంబంధాలను తెంచుకుని మరి భారత్ లోనే గడిపే విదేశీ ఆటగాళ్లకు ఐపీఎల్ అంటే ఎందుకంత  మోజు..? నిజంగా ఇక్కడి ఫ్రాంచైజీల మీద అంత ప్రేమ ఉందా..? 

‘ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇక ఎంతమాత్రమూ ఇండియాకు పరిమితం కాదు.. అది విశ్వవ్యాప్తమైంది..’  ఓ సందర్భంలో బీసీసీఐ కార్యదర్శి  జై షా చెప్పిన మాట ఇది.  అవును.. అంతర్జాతీయ  క్రికెట్ మండలి (ఐసీసీ) ని సాకుతున్న  బీసీసీఐ కి ఇంత ఆదాయం ఎక్కడినుంచి వస్తుందంటే అందరికి గుర్తొచ్చే పేరు ఐపీఎల్. ఈ  మెగా టోర్నీలో ఆడేందుకు ఎక్కడెక్కడి దేశాల ఆటగాళ్లో  ఇండియాకు వస్తారు. సుమారు రెండు నెలల పాటు తమ దేశంతో సంబంధాలను తెంచుకుని మరి భారత్ లోనే గడుపుతారు. వారి దేశాలు.. ప్రత్యర్థి దేశాలో  ద్వైపాక్షిక సిరీస్ లు కూడా కాదనుకుని.. నెలల తరబడి భారత్ లోనే ఉండటానికి కారణమేంటి..? వాళ్లకు ఇక్కడి ఫ్రాంచైజీల మీద నిజంగా ప్రేమ ఉందా..? లేక భారత్ లో ఆడటం వాళ్లకు సరదానా..?  అసలు కారణమేంటి..? 

ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో ఇండియాతో పాటు ఆఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. ఆసీస్ స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, గ్లెన్  మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్ లను  ఆయా ఫ్రాంచైజీలు కోట్లు పోసి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆటగాళ్ల కోసం భారీగా ఖర్చు పెడుతున్న  ఫ్రాంచైజీలకు అంత మొత్తం   కామనే అయినా.. ఆటగాళ్లకు మాత్రం అది ఊహించందే.. 

మెగా టోర్నీలను కాదని..

ద్వైపాక్షిక సిరీస్ లు,  వారి దేశాలలో జరిగే టీ20 టోర్నీలను కూడా కాదనుకుని ఆయా జట్లు ఇండియాలో జరిగే ఐపీఎల్ కు హాజరవుతారు ఆటగాళ్లు. ఎందుకంటే.. ఇతర లీగ్ లు, స్వదేశంలో వాళ్ల క్రికెట్ బోర్డులతో ఇచ్చే జీతాలతో పోల్చితే ఐపీఎల్ లో ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు చెల్లించే జీతాలు వందల రెట్లు అధికమవడమే దీనికి ప్రధాన కారణం. ఇతర దేశీయ టీ20 టోర్నీలతో పోల్చితే ఐపీఎల్ లో ఆటగాళ్లకు వంద శాతం ఎక్కువ  నగదు ఐపీఎల్ లో లభిస్తున్నది.  కొంతమందికైతే ఇది 200 శాతంగా కూడా ఉంది. 

2018లో గ్లోబల్ స్పోర్ట్స్ సాలరీస్ సర్వే నివేదిక ప్రకారం.. ఒక ఐపీఎల్ ఆటగాడు మ్యాచుకు రూ. 2.78 కోట్ల ఆదాయం పొందుతున్నాడు.  అదే యూఎస్ఏలోని నేషనల్ ఫుట్బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) లో ఒక ఆటగాడు 16  మ్యాచులకు సంపాదించే మొత్తం రూ. 1.40 కోట్లుగా ఉంది. ఇక ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) లో  ఒక ఆటగాడికి ఒక్కో మ్యాచుకు చెల్లించే మొత్తం రూ. 79 లక్షలు.. 

ఐపీఎల్ విలువ నానాటికీ  పెరుగుతుండటంతో విదేశీ ఆటగాళ్లు కూడా తూచా తప్పకుండా సీజన్ అంతా అందుబాటులో ఉంటున్నారు.  ఆట సంగతి పక్కనబెడితే.. ఒక్క సీజన్ లో భారీ మొత్తానికి ఏదైనా జట్టు కొనుగోలు చేస్తే ఆ ఆటగాడి పంట పండినట్టే. ఒకవేళ అతడు.. నిలకడగా ప్రదర్శనలు చేస్తే ఇక అతడు కోటీశ్వరుడే.. 

ఇతర లీగ్ లతో పోల్చితే  ఐపీఎల్ లో పలువురు ఆటగాళ్ల జీతాలు.. 

- ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ డి ఆర్సీ మాథ్యూ షాట్.. బిగ్ బాష్ లీగ్ లో హోబర్ట్ హరికేన్స్ తరఫున ఆడితే వచ్చే మొత్తం రూ. 2 కోట్లు. కానీ  అతడు రాజస్థాన్ రాయల్స్ తరఫున (2018లో) ఆడితే అతడికి దక్కిన మొత్తం రూ.  4 కోట్లు 
- ఆఫ్ఘాన్  స్పిన్నర్ రషీద్ ఖాన్ దాదాపు అన్ని దేశాలలో జరిగే టీ20 లీగ్ లలో పాల్గొంటాడు.  పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో లాహోర్ ఖలందర్స్ తరఫున ఆడే అతడికి ఆ ఫ్రాంచైజీ చెల్లించే మొత్తం రూ. 1.2 కోట్లు.. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) లో బార్బోడస్ రాయల్స్ తరఫున వచ్చే మొత్తం రూ. 83 లక్షలు. కానీ ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ అతడిని రూ. 15 కోట్లకు రిటైన్ చేసుకుంది. 

- దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ కూడా అన్ని లీగ్ లలో మెరుస్తుంటాడు. పీఎస్ఎల్ లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్న అతడికి అక్కడ వచ్చే మొత్తం రూ. 1.2 కోట్లు.. సీపీఎల్ లో రూ. 97 లక్షలు..ఐపీఎల్ వేలంలో  డుప్లెసిస్ ను  ఆర్సీబీ  ఫ్రాంచైజీ రూ. 7 కోట్లకు దక్కించకుంది. 

- యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కూడా అన్ని లీగ్ లలో కనిపించేవాడే.. సీపీఎల్ లో అతడికి రూ. 74 లక్షలు వేతనం  కాగా..  బీపీఎల్, పీఎస్ఎల్, బీబీఎల్  లో కూడా కోటి రూపాయల కంటే తక్కువే. కానీ గతేడాది పంజాబ్ తరఫున అతడికి దక్కిన మొత్తం రూ. 2 కోట్లు.  ఆర్సీబీ తరఫున ఆడుతున్నప్పుడు అతడికి రూ. 8.4 కోట్లు దక్కాయి. 

మరి ఐపీఎల కు ఇన్నికోట్లు ఎక్కడ్నుంచి వస్తున్నాయి..?  

ఆటగాళ్లకు  కోట్లకు కోట్లు వెచ్చిస్తున్న ఫ్రాంచైజీలకు ఇన్ని కోట్లు ఎక్కడ్నుంచి వస్తున్నాయనేది ఇప్పుడు ఆసక్తికర  ప్రశ్న. బీసీసీఐకి, ఐపీఎల్ కు ఈ ఆదాయం.. మీడియా రైట్స్, టైటిల్ స్పాన్సర్స్,  టీమ్ స్పాన్సర్స్, యాడ్స్ నుంచి వస్తున్నది. వీటి ద్వారా వచ్చే ఆదాయం నుంచే  ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. ఆటగాళ్లకు  డబ్బులు చెల్లిస్తాయి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !