రిచా ఘోష్ రికార్డు హాఫ్ సెంచరీ... అయినా టీమిండియాకి దక్కని విజయం...

Published : Feb 22, 2022, 01:36 PM IST
రిచా ఘోష్ రికార్డు హాఫ్ సెంచరీ... అయినా టీమిండియాకి దక్కని విజయం...

సారాంశం

26 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన రిచా ఘోష్... అయినా టీమిండియాకి తప్పని ఓటమి...

న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న భారత జట్టు ఒక్క విజయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. టీ20 మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఓడిన భారత జట్టు, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది. మంగళవారం జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో భారత మహిళా జట్టు 63 పరుగుల తేడాతో పరాజయం పాలైంది...

వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు అంపైర్లు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళా జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగుల భారీ స్కోరు చేసింది...

న్యూజిలాండ్ కెప్టెన్ సోఫియా డివైడ్ 24 బంతుల్లో 6 ఫోర్లతో 32 పరుగులు చేయగా, సూజీ బేట్స్ 26 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేసింది. సత్తెర్థ్‌వేట్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి మేఘానా సింగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా ఫ్రాన్సెస్ మక్రే 16 బంతుల్లో 7 పరుగులు చేసి రేణుకా సింగ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యింది. 5 పరుగులు చేసిన లూరెన్ డౌన్‌ను దీప్తి శర్మ అవుట్ చేయగా అమెలియా కేర్ 33 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది...

భారత బౌలర్లలో రేణుకా సింగ్‌కి రెండు వికెట్లు దక్కగా మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ తలా ఓ వికెట్ తీశారు... 192 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన భారత జట్టుకి శుభారంభం దక్కలేదు. యంగ్ సెన్సేషనల్ ఓపెనర్ షెఫాలీ వర్మ తొలి ఓవర్ ఆఖరి బంతికి డకౌట్ అయ్యింది. ఆ తర్వాత యషికా భాటియా కూడా గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరింది...

5 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసిన పూజా వస్తాకర్‌. 15 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి స్మృతి మంధాన కూడా వెంటవెంటనే అవుట్ కావడంతో 19 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు...

ఈ దశలో 19 ఏళ్ల వికెట్ కీపర్ రిచా ఘోష్ సునామీ ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేసిన రిచా ఘోష్... అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది...

2018లో భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ వేది కృష్ణమూర్తి, సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో 32 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసింది. ఇప్పటిదాకా అదే భారత మహిళా క్రికెట్‌లో ఫాస్టెస్ట్ వన్డే హాఫ్ సెంచరీగా ఉంది. ఇదే సిరీస్‌లో 33 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన ఓపెనర్ సబ్బినేని మేఘన, అత్యంత వేగంగా ఫాస్ట్ సెంచరీ నమోదు చేసిన మూడో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది...

కెప్టెన్ మిథాలీ రాజ్, రిచా ఘోష్ కలిసి ఐదో వికెట్‌కి 76 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పారు. నేటి మ్యాచ్‌లో మిగిలిన ప్లేయర్లు అందరూ కలిసి నాలుగు సిక్సర్లు కొడితే, రిచా ఘోష్ ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్సర్లు ఉండడం విశేషం...

రిచా ఘోష్ అవుటైన తర్వాత కెప్టెన్ మిథాలీ రాజ్ 28 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసి అవుట్ అయ్యింది. దీప్తి శర్మ 9 పరుగులు, స్నేహ్ రాణా 9 పరుగులు చేసి అవుట్ కాగా రాజేశ్వరి గైక్వాడ్ 4 పరుగులు చేసి అవుట్ కావడంతో 128 పరుగులకే ఆలౌట్ అయ్యింది భారత జట్టు...

న్యూజిలాండ్ జట్టుకి 63 పరుగుల తేడాతో విజయం దక్కింది. బ్యాటింగ్‌లో 68 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన అమెలియా కేర్ బౌలింగ్‌లో 3.5 ఓవర్లలో 3 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ షోతో టీమిండియా ఓటమికి కారణమైంది.. 
 

PREV
click me!

Recommended Stories

తెలుగోడికి హ్యాండ్ ఇచ్చిన ఫ్రాంచైజీలు.. ఏంటి కావ్య పాప.! రూ. 75 లక్షలు కూడా లేవా..
INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం