Virat Kohli: మేమేం పాపం చేశాం..? మా ఓపికను ఎందుకు పరీక్షిస్తున్నావ్..? కోహ్లిపై అభిమానుల ఆగ్రహం

By Srinivas MFirst Published Jul 1, 2022, 8:49 PM IST
Highlights

England vs India: ఎడ్జబాస్టన్ టెస్టులో భారత జట్టు టాపార్డర్ దారుణంగా వైఫల్యం చెందింది. మూడేండ్లుగా శతకం లేక ఇబ్బంది పడుతున్న కోహ్లి తొలి ఇన్నింగ్స్ లో కూడా అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. 

950 రోజులు.. సరిగ్గా చెప్పాలంటే మూడేండ్లకు ఓ రెండు మాసాలు తక్కువ. ప్రపంచ దిగ్గజ బ్యాటర్ గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న టీమిండియా మాజీ సారథి  విరాట్ కోహ్లి సెంచరీ చేయక గడుస్తున్న రోజులవి. ఒక సాధారణ బ్యాటర్ నాలుగైదు మ్యాచులలో ఆడకుంటేనే జట్టులోంచి తీసేయడమో.. లేక ‘ఫామ్ కోల్పోయావ్ దేశవాళీలో ఆడి నిన్ను నువు నిరూపించుకో.. తర్వాత జాతీయ జట్టులోకి చూద్దాం’ అని సెలక్టర్లు వారి ముఖం మీదే చెబుతున్న రోజులివి. టీమిండియాలో పోటీ కూడా అలా ఉంది. కానీ సెంచరీ లేక ఒక బ్యాటర్ మూడేండ్లుగా నెట్టుకొస్తున్నాడంటే జట్టులో అతడిని ఉంచాలా..? తీసేయాలా..? అనేది కూడా ఆలోచించాలంటున్నారు. ఈ మాటలంటున్నది వేరేవరో కాదు. ‘ఇక కోహ్లి ఆడేట్టు లేడు..’అని  ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన అతడి భక్తులే..  

ఓపికకు కూడా హద్దులుంటాయి. సహనం నశిస్తే ఏమవుతుందనేది కొత్తగా చెప్పాల్సిన పన్లేదు.  కానీ కోహ్లి మాత్రం అతడి అభిమానులతో పాటు  టీమిండియా ఫ్యాన్స్ సహనాన్ని మూడేండ్లుగా పరీక్షిస్తూనే ఉన్నాడు. ప్రతి మ్యాచ్ కు ముందు ‘ఇక ఆడతాడ్లే..’ అనుకున్న ప్రతీసారి అతడు ఓ చెత్త షాట్ ఆడటం, పెవిలియన్ కు నిరాశగా వెళ్లడం.. ఇదే తంతు. 

ఇంగ్లాండ్ తో ఎడ్జబాస్టన్ వేదికగా  జరుగుతున్న ఐదో టెస్టుకు ముందు కోహ్లి ఐపీఎల్ లో విఫలమైన తీరును చూసి అందరూ  అతడిని విమర్శించడం కంటే  ‘పాపం కోహ్లి కాస్త విశ్రాంతి తీసుకుంటే మంచిదేమో.. అప్పుడైనా తిరిగి ఫామ్ లోకి వస్తాడు..’అని జాలి చూపించారు.  కోహ్లికి అత్యంత ఆప్తుడైన మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు క్రికెట్ పండితులంతా సలహాలిచ్చారు. వాళ్ల కోరిక మేరకు ఐపీఎల్ ముగిశాక  కోహ్లి మాల్దీవులు ట్రిప్ వెళ్లొచ్చాడు. దాదాపు నెల రోజుల తర్వాత గ్రౌండ్ లోకి వచ్చిన కోహ్లి ఏమైనా మెరుగయ్యాడా..?  ఇంగ్లాండ్ తో  జరుగుతున్న టెస్టులో అతడు చేసింది 11 పరుగులు.  

కోహ్లి ఆటతీరుపై అతడి అభిమానులతో పాటు నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలంలా మండిపోతున్నారు. పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘950 రోజులైంది సెంచరీ లేక..’, ‘మా సహనాన్ని ఇంకెన్ని రోజులు పరీక్షిస్తావ్..? ’‘నిన్ను నమ్ముకున్నాం చూడు.. మాదీ బుద్ది తక్కువ..’ అని కామెంట్లు పెడుతున్నారు. 

 

why are you testing our patience level ??

— 𝐒𝐀𝐊𝐒𝐇𝐀𝐌 (@albaatrross)

 

950 days without international century. pic.twitter.com/QtdTtowr4L

— ` (@meamanraza)

విరాట్ చివరిసారిగా 2019 ఆగస్టు లో ఈడెన్ గార్డెన్ లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టులో సెంచరీ చేశాడు. ఆ తర్వాత మళ్లీ అతడి బ్యాట్ నుంచి  సెంచరీ రాలేదు. ఫలితంగా.. టెస్టులలో 2020 కి ముందు కోహ్లి సగటు 54.97 ఉండగా.. ఆ తర్వాత అది 27.48 గా మారింది. ఈ ఒక్కటి చాలు కోహ్లి ఎంత అధ్వాన్నంగా ఆడుతున్నాడో చెప్పడానికి.. కోహ్లి ఇలాగే ఆడితే మరికొద్దిరోజుల్లో అతడిని సెలక్టర్లు కూడా భరించడం కష్టమే అన్నది బహిరంగ రహస్యమే.. 

click me!