
మనం ఊహించనిది జరిగేదే జీవితం. అంతా అనుకున్నట్టే జరిగితే అందులో కిక్కేముంది..? ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన చాలా మంది వారు అనుకున్న రంగంలో సక్సెస్ అయ్యారు కాబట్టే.. వారికి అంత గుర్తింపు దక్కింది. కానీ వాళ్లు గుర్తింపు దక్కిన దేశంలో పుట్టి ఉండకుంటే..? అదేంటి..? అనుకుంటున్నారా..? అచ్చంగా ఐస్లాండ్ దేశానికి కూడా ఇదే డౌటొచ్చింది. అందుకే ఓ ట్వీటు ట్వీటి అభిమానులను ఆకట్టుకుంటున్నది.
యూరప్ ఖండంలోని ఓ ద్వీప కల్పం ఐస్లాండ్. ఇది ప్రపంచంలోనే 18వ ఐలాండ్. నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఈ దేశంలో క్రికెట్ ఆడటం అనేది ఇప్పుడిప్పుడే మొదలవుతున్నది.
తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించిన ఐస్లాండ్ క్రికెట్... ‘జీవితం అనేది సందర్భం, అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ రవిచంద్రన్ అశ్విన్ శ్రీలంకలో పుట్టి ఉంటే బహుశా అతడు ముత్తయ్య మురళీధరన్ అత్యధిక టెస్టు వికెట్ల (800) ను బద్దలు కొట్టేవాడేమో.. అలాగే క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్మన్ ఆస్ట్రేలియాలో కాకుండా ఐస్లాండ్ లో పుట్టి ఉంటే.. ఆయన ఒక్క అంతర్జాతీయ పరుగు కూడా చేసేవాడు కాదేమో. అంతేగాక ఒక సాధారణ చేపలు పట్టే మత్స్యకారుడుగా మిగిలిపోయేవాడేమో.. జీవితం అంటే అంతే...’ అని ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్ కు నెటిజన్లు ఫిదా అయ్యారు. అశ్విన్ తో పాటు విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మీద సెటైర్లు వేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపట్లోనే వైరల్ గా మారింది. కాగా.. ఇటీవలే ముగిసిన న్యూజిలాండ్ సిరీస్ లో అద్భుత ప్రదర్శనతో తిరిగి సత్తా చాటిన అశ్విన్ మరో ఘనతను కూడా అందుకున్నాడు. ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా సత్తా చాటిన అశ్విన్.. భారత్ తరఫున హయ్యస్ట్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి చేరాడు.
35 ఏండ్ల అశ్విన్.. 81 టెస్టులలో 427 వికెట్లు తీశాడు. అశ్విన్ కంటే ముందు అనిల్ కుంబ్లే (619 వికెట్లు), దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ (434 వికెట్లు) మాత్రమే ఉన్నారు. ఇదిలాఉండగా దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల పర్యటన నిమిత్తం అక్కడికి వెళ్లిన అశ్విన్.. సెంచూరియన్ లో స్థానం దక్కించుకున్నాడు.