
అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ లో పాల్గొనబోయే దేశాలలో పలు దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఇండియాలు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్లను ప్రకటించాయి. తాజాగా మాజీ ఛాంపియన్స్ వెస్టిండీస్ తో పాటు బంగ్లాదేశ్ కూడా ప్రపంచకప్ లో పాల్గొనబోయే జట్లను వెల్లడించాయి. కానీ ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే మరికొన్ని జట్లు ఇప్పటికీ తమ జట్లను ప్రకటించలేదు. ప్రపంచకప్ కోసం సెప్టెంబర్ 15 వరకు అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాలి.
2012, 2016లలో టీ20 ఛాంపియన్స్ అయిన వెస్టిండీస్.. తాజాగా ప్రకటించిన జట్టుకు నికోలస్ పూరన్ సారథిగా ఎంపికకాగా.. రోవ్మెన్ పావెల్ వైస్ కెప్టెన్ గా ఉండనున్నాడు. పవర్ హిట్టర్ గా గుర్తింపు పొందిన ఎవిన్ లూయిస్ రీఎంట్రీ ఇవ్వగా.. పూర్తి టీ20 ప్లేయర్లతో ఈసారి విండీస్ బరిలోకి దిగుతున్నది.
అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కాబోయే ఈ టోర్నీలో ఇంకా జట్లను ప్రకటించని దేశాల జాబితా చూస్తే.. గ్రూప్-ఏ (అర్హత రౌండ్) లో నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యూఏఈ ఉన్నాయి. ఈ దేశాలలో నమీబియా, నెదర్లాండ్స్ మాత్రమే జట్లను ప్రకటించాయి. ఇంకా శ్రీలంక, యూఏఈ ప్రకటించలేదు.
గ్రూప్-బీలో ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే ఉన్నాయి. వీటిలో వెస్టిండీస్ తప్ప మిగిలిన దేశాలు ఇంకా జట్లను ప్రకటించలేదు.
ఇక సూపర్-12 లో ఉన్న జట్లను పరిశీలిస్తే గ్రూప్-ఏలో అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఉన్నాయి. వీటిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లను ప్రకటించగా అఫ్గాన్, కివీస్ ఇంకా వెల్లడించలేదు.
గ్రూప్-బిలో బంగ్లాదేశ్, ఇండియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్ లు ఉన్నాయి. వీటిలో పాకిస్తాన్ మినహా మిగిలిన మూడు దేశాలూ 15 మంది సభ్యులను ప్రకటించాయి.