అక్కడ క్రికెట్ ఎక్కడుంది..? అంతా వ్యాపారమే.. ఐపీఎల్ పై పాక్ క్రికెటర్ల అక్కసు

By Srinivas MFirst Published Jun 23, 2022, 12:53 PM IST
Highlights

Rashid Latif Comments On IPL: ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని చూసి పాకిస్తాన్ క్రికెటర్ల మైండ్ బ్లాక్  అయినట్టుంది. నోటికేదొస్తే అది వాగుతున్నారు. 

బీసీసీఐ ఆధ్వర్యంలో నడుస్తున్న అత్యంత విజయవంతమైన  ఇండియన్  ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పై  దాయాది దేశం పాకిస్తాన్ క్రికెటర్లు తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. తమ దేశంలో ఇలాంటి లీగ్ లేదనో లేక పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) కు  ఇంతటి క్రేజ్ లేదనో.. రెండూ గాక బీసీసీఐ ఇటీవలే ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా సంపాదించిన ఆదాయాన్ని చూసి కన్నుగొట్టిందో ఏమో గానీ నోటికేదొస్తే అది వాగుతున్నారు. ఐపీఎల్ అంటే అంతా వ్యాపారమే అని.. అసలక్కడ క్రికెట్ ఎక్కడుంది..? అని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ కూడా చేరాడు. 

ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ రూ. 48,390 కోట్లు ఆర్జించిన నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్ లో లతీఫ్ స్పందిస్తూ.. ‘మనమిక్కడ క్రికెట్ గురించి మాట్లాడాల్సిన  అవసరం లేదు. ఇక్కడ జరుగుతున్నదంతా వ్యాపారమే. ఇది సరైన పద్ధతి కాదు. నాణ్యమైన క్రికెట్ ఇది కానే కాదు.. డబ్బులే ముఖ్యమనుకుంటే  అదే దారిలో చాలా మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. వారిని కూడా జత చేసుకోండి. 

ఐపీఎల్ లో వ్యాపారం ఎక్కువై ఆటలో క్వాలిటీ తగ్గిపోయింది. అంతా కమర్షియల్ అయిపోయింది. అందుకే అందులో క్వాలిటీ తగ్గిపోయింది. ఐపీఎల్ జరుగుతున్న సమయంలో ఓ భారతీయుడిని పిలిచి మీరు ఎన్ని గంటలు మ్యాచ్ చూస్తున్నారని అడగండి.. సమాధానం మీకే తెలుస్తుంది.. అందుకే అదంతా బిజినెస్ తప్ప  ఆట లేదు. అది ఎలా నిలదొక్కుకుంటుందో చూద్దాం..’ అని వ్యాఖ్యానించాడు. 

కాగా ఐపీఎల్ పై పాక్ క్రికెటర్లు కామెంట్స్ చేయడం ఇదేం కొత్త కాదు. ఇక్కడితోనే ఆగిపోయేదీ లేదు. రెండ్రోజుల క్రితం షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ.. భారత్ లో క్రికెట్ కు మంచి మార్కెట్ ఉంది. అందుకే దానికి (బీసీసీఐ) ఆదాయం బాగుంది. ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ ఏం చెబితే అది చెల్లుతుందని నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. 

ఐపీఎల్ పై నోటికేదొస్తే ఏది వాగుతున్న ఈ క్రికెటర్లే.. మ్యాచులు జరుగుతున్నప్పుడు  రోజూ యూట్యూబ్ లలో విశ్లేషణ పేరిట వీడియోలను పెడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. సల్మాన్ భట్, ఇంజమాముల్ హక్, షోయభ్ అక్తర్ వంటి క్రికెటర్లందరూ ఐపీఎల్ లో ఆడకున్నా పరోక్షంగా  ఐపీఎల్ ద్వారా లాభం పొందుతున్నవారే కదా..? మరి దానినేమంటారు..? అని టీమిండియా ఫ్యాన్స్ లతీఫ్ ను ప్రశ్నిస్తున్నారు. మాములు సమయాల్లో వీళ్లు పెట్టే వీడియోలను పాక్ లో కూడా ఎవరూ చూడరు. కానీ ఐపీఎల్ సమయంలో వీరి వీడియోలకు లక్షల్లో లైకులు, వ్యూస్ వస్తుండటం గమనార్హం. ఇప్పుడు నీతులు చెబుతున్న ఈ లతీఫ్ కూడా ఈ గూటిలోనే పక్షే కావడం విశేషం. ఇప్పుడు చెప్పండి ఎవరిది వ్యాపారం..? ఎవరిది ఆట..? 

click me!