CPL T10: ఇక టీ10.. కొత్త టోర్నీకి శ్రీకారం చుట్టనున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్

By Srinivas MFirst Published Jun 23, 2022, 12:18 PM IST
Highlights

CPL T10 Tournament: ‘తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు’ అనే సామెతను గుర్తు చేస్తూ టెస్టు, వన్డే క్రికెట్  అస్తిత్వాన్ని దెబ్బతీసిన టీ20కి పోటీగా మరో ఫార్మాట్ రాబోతున్నది. 

‘కొత్తొక వింత పాతొక రోత’ అన్నచందంగా తయారవుతున్నది అంతర్జాతీయంగా క్రికెట్ పరిస్థితి. సాంప్రదాయక టెస్టు క్రికెట్ తో పాటు 50ఓవర్ల వన్డే క్రికెట్ కు నూకలు చెల్లిస్తూ ఈ శతాబ్దం ప్రారంభంలో వచ్చిన టీ20 క్రికెట్టే ఇప్పుడు ఈ ఆటకు కర్త, కర్మ, క్రియ అయి కూర్చుంది. ఇక రాబోయే రోజుల్లో ఇది కూడా కనుమరుగయ్యే రోజులు కనబడుతున్నాయి. ‘తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు’అనే సామెతను గుర్తు చేస్తూ టీ20 క్రికెట్ ను సాగనంపడానికి నేనున్నానంటూ వచ్చేస్తున్నది టీ10.  ఇక క్రికెట్ అంటే ఒక జట్టుకు మిగిలేది 10 ఓవర్లు.. 60 బంతులు.. ఎంత కొట్టుకున్నా, ఎన్ని విధ్వంసాలు జరిగినా ఆ 60 బంతుల్లోనే.. 

ఈ లీగ్ కు ఇప్పటికే యూఏఈ లో ప్రాచుర్యం కల్పిస్తుండగా తాజాగా  కరేబియన్ దీవులు కూడా అదే బాట పట్టాయి. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్).. వచ్చే ఆగస్టు నుంచి టీ10 టోర్నీని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఈ మేరకు తెర వెనుక ప్రయత్నాలను కూడా చకచకా పూర్తి చేస్తున్నది. 

ఈ ఏడాది  సీపీఎల్ -10వ ఎడిషన్ కంటే ముందే ఆగస్టు లోనే దీనిని ప్రారంభించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ‘The 6ixty’ లీగ్ గా పిలుస్తున్న  ఈ టోర్నీలో సీపీఎల్ లో పాల్గొంటున్న ఆరు మెన్స్ టీమ్స్, 3 ఉమెన్స్ టీమ్స్ పాల్గొంటాయి. సెయింట్ కిట్స్ వేదికగా (ఆగస్టు 24 నుంచి) ఈ టోర్నీ జరుగుతుంది. క్రికెట్ వెస్టిండీస్ బోర్డు ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరుగుతున్నది. కాగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి  యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. 

కొత్త నిబంధనలు : 

- సాధారణ క్రికెట్ లో మాదిరిగా ఇందులో ఒక ఇన్నింగ్స్ కు  పది మంది బ్యాటింగ్ చేయరు. బ్యాటింగ్ కు వచ్చేది ఆరుగురు బ్యాటర్లే.. 
- బ్యాటింగ్ చేస్తున్న టీమ్ తొలి ఓవర్లో  రెండు సిక్సర్లు కొడితే వాళ్లకు థర్డ్ పవర్ ప్లే అందుబాటులోకి వస్తుంది. రెండు సిక్సర్లు కొట్టలేని పక్షంలో మూడో పవర్ ప్లే ఉండదు. 
- ప్రస్తుతం ఓవర్ ఓవర్ కు మధ్యలో ఫీల్డింగ్ ఛేంజ్, వికెట్ కీపర్ వేరే ఎండ్ మళ్లడం వంటివి ఇందులో ఉండవు. ఒకే ఎండ్ నుంచి వరుసగా ఐదు ఓవర్లు బౌలింగ్ చేసుకోవచ్చు. 
- 45 నిమిషాల్లో పది ఓవర్లు వేయలేకుంటే చివరి ఆరు బంతులు వేసేప్పుడు బౌలింగ్ టీమ్ నుంచి ఒక ఫీల్డర్ ను తీసేస్తారు. అంటే బౌలర్, కీపర్ పోను ఫీల్డింగ్ చేసేది 8 మందే. 
- ఫ్యాన్స్ కోసం మిస్టరీ ఫ్రీ హిట్. (దీని గురించి వివరాలు తెలియజేయలేదు) 

 

60 balls, 6 men's teams, 3 women's teams, radical new rules. Join us as we see the CPL teams compete in https://t.co/i8TGhUFafz

— CPL T20 (@CPL)

ఈ ‘The 6ixty’ లీగ్ ను ఏడాదికి నాలుగుసార్లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామని సీపీఎల్ సీఈవో రసెల్ తెలిపారు. అయితే ‘The 6ixty’  లీగ్ నిబంధనలు, ఆటతీరు పై వస్తున్న విమర్శలపై ఆయన బదులిస్తూ.. క్రికెట్ అంటేనే ఎగ్జైట్మెంట్ అని అభిమానుల ఆసక్తికి అనుకూలంగా  ఆటలో మార్పులు చేస్తే తప్పులేదు కదా..? అని తిరిగి ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడల్లో వస్తున్న మార్పులను బట్టి ఈ ఆటలో కూడా మార్పులు చేయాలని, అప్పుడే అది  అందరికీ  నచ్చేవిధంగా ఉంటుందని వ్యాఖ్యానించడం గమనార్హం. 

click me!