ఏం కంగారుపడకు ప్రియతమా.. నేనొచ్చేశాగా : మైఖేల్ వాన్ కు తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చిన వసీం జాఫర్..

By Srinivas MFirst Published Jan 17, 2022, 12:43 PM IST
Highlights

Wasim Jaffer-Michael Vaughn Twitter war: టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల ప్రదర్శన, ఆటగాళ్ల ఆట ఎలా ఉన్నా ఈ రెండు జట్లకు చెందిన ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు మైఖేల్ వాన్,  వసీం జాఫర్ లు మాత్రం రెండు దేశాల క్రికెట్ అభిమానులకు తమ ట్వీట్లతో ఫన్ ను పంచుతున్నారు. 
 

టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్, ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు  మైఖేల్ వాన్ మధ్య కొంతకాలంగా నడుస్తున్న ట్వీట్ల యుద్ధం నిరాటంకంగా కొనసాగుతుంది. ఇరు జట్లకు చెందిన  విజయాలు, అపజయాల సందర్భంలో ఈ ఇద్దరు ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటూ అభిమానులకు ఫన్ పంచుతున్నారు.  ఇంగ్లాండ్, ఇండియా క్రికెట్ జట్లు ఎక్కడికి వెళ్లినా వాళ్ల ఆట కంటే జాఫర్, వాన్ ల  ట్వీట్ల పోరు కూడా  అభిమానులకు మజాను ఇస్తున్నది. కాగా, దక్షిణాఫ్రికాతో టీమిండియా సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో జాఫర్ ను గెలికిన  వాన్ కు.. అతడు  ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు. 

దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్ లో టీమిండియా 1-2 తేడాతో ఓటమిపాలైంది. దీంతో వాన్.. జాఫర్ ను ట్రోల్ చేశాడు. కేప్టౌన్ లో టెస్టు ముగిశాక వాన్..  ‘శుభ సాయంత్రం జాఫర్.. నువ్వు ఓకేనా..?’ అని  ట్వీట్ చేశాడు. 

 

Haha all good Michael, don't forget we are still leading you 2-1 😆 https://t.co/vjPxot43mF

— Wasim Jaffer (@WasimJaffer14)

దీనికి జాఫర్ ఆదివారం  వాన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఓ బాలీవుడ్ సినిమాలోని పాటను ‘నేనొచ్చేశాను ప్రియతమా..’ అన్న క్యాప్షన్ తో రిప్లై ఇచ్చాడు. అంతేగాక అదే ట్వీట్ లో ‘హెలో మైఖేల్.. యాషెస్ ఏమైంది..?’ అని వాన్ ను ట్రోల్ చేశాడు. ఇక దీనికి వాన్ కూడా బదులివ్వడం గమనార్హం.  జాఫర్ ట్వీట్ ను  ట్యాగ్ చేస్తూ.. ‘శుభసాయంత్రం వసీం.. నిజంగా ఇదొక సుదీర్ఘమైన రోజు..’ అని బదులిచ్చాడు. 

వీళ్లిద్దరి ట్వీట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా వాన్ కు జాఫర్ ఇస్తున్న ట్వీట్ల కౌంటర్లు టీమిండియా అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. వాన్ ను ఏకిపారేస్తున్న జాఫర్ పై వాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘వాన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చావు జాఫర్.. నువ్వు సూపర్..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

Evening Wasim .. !! It’s been a long day … https://t.co/PUYVdr4nKC

— Michael Vaughan (@MichaelVaughan)

కాగా.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో జాఫర్ మాట్లాడుతూ.. ‘అతడి (మైఖేల్ వాన్)కి అనవసరమైన విషయాలలో తలదూర్చే అలవాటు ఎక్కువగా ఉంది. అది నాకస్సలు నచ్చదు. తనకు సంబంధం లేకున్నా భారత అభిమానులను ఏదో విధంగా పోక్ చేస్తూనే ఉంటాడు. అదే సమయంలో ఇంగ్లాండ్ జట్టు ఏమంత గొప్పగా ప్రదర్శిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఆసీస్  వేదికగా జరుగుతున్న యాషెస్ లో  ఆ జట్టు ప్రతిభ ఏపాటిదో మనం చూస్తున్నాం..’ అని  వ్యాఖ్యానించాడు. 

ఇదిలాఉండగా.. దక్షిణాఫ్రికాతో  తప్పక టెస్టు సిరీస్ గెలుస్తుందని భావించిన టీమిండియా..  తొలి టెస్టు లో గెలిచి తర్వాత రెండు టెస్టులలో అనూహ్య పరాజయాల పాలైన విషయం తెలిసిందే. దీంతో దక్షిణాఫ్రికా.. సిరీస్ ను 2-1 తేడాతో చేజిక్కించుకుంది. ఇక యాషెస్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా 4-0 తేడాతో ఇంగ్లాండ్ ను మట్టికరిపించిన విషయం తెలిసిందే.

click me!