ఈసారి వేలంలో అతడో హాట్ కేక్.. ఎంతైనా పెట్టి దక్కించుకుంటాం.. మూడు ఫ్రాంచైజీల కన్ను ఢిల్లీ మాజీ సారథి మీదే..

By Srinivas MFirst Published Jan 17, 2022, 10:32 AM IST
Highlights

IPL 2022 Auction: ఢిల్లీ క్యాపిటల్ప్ మాజీ సారథి శ్రేయస్ అయ్యర్ వచ్చే ఐపీఎల్ వేలంలో భారీ ధరను దక్కించుకోనున్నాడా..? క్రిస్ మోరిస్ రికార్డును అతడు బద్దలు కొట్టనున్నాడా..? ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు జట్లు అతడి మీద కన్నేయడమే ఇందుకు కారణం..  
 

మరో నాలుగు వారాల్లో ఐపీఎల్ మెగా వేలానికి తెరలేవబోతున్నది.  ఏదేమైనా  ముందుగా నిర్ణయించిన తేదీ (ఫిబ్రవరి 12, 13)  లలోనే  ఐపీఎల్-2022 మెగా వేలాన్ని నిర్వహిస్తామని ఇప్పటికే బీసీసీఐ పెద్దలు  స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి మెగా వేలంలో అందరి కళ్లు.. ఢిల్లీ క్యాపిటల్ప్ మాజీ సారథి శ్రేయస్ అయ్యర్  మీదే ఉన్నాయి. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు జట్లు అతడి మీద కన్నేశాయి.   సారథుల కొరత ఎదుర్కుంటున్న ఆ జట్లు.. అయ్యర్ ను దక్కించుకోవడానికి వేలంలో ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడటం లేదని సమాచారం. 

గతేడాది డిసెంబర్ లో స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో  భాగంగా.. కాన్పూర్ టెస్టులో అరంగ్రేటం చేసిన శ్రేయస్ అయ్యర్ తొలి టెస్టులోనే సెంచరీ చేశాడు.  ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు ఎంపికైనా అతడికి ఆడే అవకాశం దక్కలేదు. దీంతో అతడు కాస్త నిరాశకు గురయ్యాడు. కానీ ఐపీఎల్ లో మాత్రం అతడికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.  

మూడు ఫ్రాంచైజీల కన్ను అతడి మీదే.. 

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈసారి వేలంలో అతడిని దక్కించుకోవడానికి రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ సూపర్ కింగ్స్ లు కాచుకుని కూర్చున్నాయని తెలుస్తున్నది.గతంలో అతడు లక్నో, అహ్మదాబాద్ లకు  సారథ్యం వహిస్తాడని వార్తలు వచ్చినా  అది నిజం కాదని తేలిపోయింది. లక్నోకు కెఎల్ రాహుల్, అహ్మదాబాద్ కు హార్దిక్ పాండ్యా (ఇంకా అధికారికంగా ప్రకటించలేదు) లు సారథులుగా ఇప్పటికే నియమితులైనట్టు  వార్తలు వస్తున్నాయి. అయితే పైన పేర్కొన్న ఆర్సీబీ, కేకేఆర్, పీబీకేఎస్ లకు ప్రస్తుతం సారథులు లేరు. శ్రేయస్ అయ్యర్  మంచి బ్యాటరే గాక గతంలో ఢిల్లీ సారథిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో అతడిని దక్కించుకోవడానికి ఆ 3 ఫ్రాంచైజీలు  వేచి చూస్తున్నాయి. 

దీంతో ఈ  ఐపీఎల్ మెగా వేలంలో అయ్యర్ హాట్ కేకుగా మారనున్నాడు. ఢిల్లీని వీడటం అయ్యర్ కు ఆర్థికంగా మంచే  చేసిందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ఈ మూడు ఐపీఎల్ జట్లకు స్కౌట్లు (ఆటగాళ్ల వివరాలను ఫ్రాంచైజీలకు అందించేవాళ్లు) అందించిన సమాచారం మేరకు.. ‘ఈసారి వేలంలో అయ్యర్ హాట్ కేక్ గా మారబోతున్నాడు.  ఇప్పటికే మూడు, నాలుగు ఫ్రాంచైజీలు అతడిని కెప్టెన్ గా నియమించుకోవడానికి వేచి చూస్తున్నాయి.  నాయకత్వ లక్షణాలు కూడా ఉండటంతో ఈసారి అతడికి  భారీ ధర దక్కే అవకాశముంది..’ అని తెలిపాడు. అయితే  అతడికి ఎంత చెల్లిస్తారనేదానిపై మాత్రం సదరు స్కౌట్ వివరాలు వెల్లడించలేదు. ‘మా వ్యూహాన్ని మేం ఇక్కడ వెల్లడించబోం. ఐపీఎల్ వేలంలో మీరే చూస్తారు..’ అని వ్యాఖ్యానించాడు. 

క్రిస్ మోరిస్ రికార్డును బద్దలు కొడతాడా..? 

ఇవన్నీ చూస్తుంటే ఈసారి ఐపీఎల్ వేలంలో అయ్యర్ కు భారీ ధర దక్కే  అవకాశమున్నట్టు స్పష్టమవుతున్నది. ఐపీఎల్ లో ఇప్పటివరకు  క్రిస్ మోరిస్ (రాజస్థాన్ రాయల్స్) దే అత్యధిక సాలరీ. 2021 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ అతడిని  ఏకంగా రూ. 16.25 కోట్లు పోసి దక్కించుకుంది. ఈ ధరను ఇప్పుడు అయ్యర్ బద్దలు కొట్టనున్నాడని తెలుస్తున్నది. రూ. 20 కోట్లు అయినా ఇచ్చి అయ్యర్ ను దక్కించుకునేందుకు ఆర్సీబీ, కేకేఆర్, పీబీకేఎస్ లు భావిస్తున్నట్టు సమాచారం. 

ఇక ఇప్పటివరకు 7 ఐపీఎల్ లు ఆడిన అయ్యర్.. రూ. 35.8 కోట్లు సంపాదించాడు. చివరిసారి అతడు ఢిల్లీకి ఆడినప్పుడు అతడి వేతనం రూ. 7 కోట్లు.  ఐపీఎల్ లో 87 మ్యాచులు ఆడిన  శ్రేయస్.. 2,375 పరుగులు చేశాడు. 2020 సీజన్ లో ఢిల్లీని ఐపీఎల్ ఫైనల్ కు చేర్చడంలో అయ్యర్  దే కీలక పాత్ర.  
 

click me!