ఖచ్చితంగా లెజెండ్ అవుతాడు: వాషింగ్టన్ సుందర్ తండ్రి పుత్రోత్సాహం

Siva Kodati |  
Published : Jan 22, 2021, 06:45 PM ISTUpdated : Jan 22, 2021, 07:33 PM IST
ఖచ్చితంగా లెజెండ్ అవుతాడు: వాషింగ్టన్ సుందర్ తండ్రి పుత్రోత్సాహం

సారాంశం

ఆస్ట్రేలియా గడ్డపై ఘన విజయంతో స్వదేశానికి చేరుకున్న టీమిండియా క్రికెటర్లకు ఘన స్వాగతం లభిస్తోంది. చివరి టెస్టులో అద్భుతంగా రాణించిన వాషింగ్టర్ సుందర్ హీరోగా మారిపోయాడు

ఆస్ట్రేలియా గడ్డపై ఘన విజయంతో స్వదేశానికి చేరుకున్న టీమిండియా క్రికెటర్లకు ఘన స్వాగతం లభిస్తోంది. చివరి టెస్టులో అద్భుతంగా రాణించిన వాషింగ్టర్ సుందర్ హీరోగా మారిపోయాడు.

ఈ నేపథ్యంలో ఆయన తండ్రి సుందర్ పుత్రోత్సాహంతో పొంగిపోయారు. ఈ ప్రదర్శన ఎంతో ప్రత్యేకమని... వాషింగ్టన్‌ సుందర్‌ లెజెండ్‌గా ఎదుగుతాడని సుందర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

అతనికి ప్రతిభ, నైపుణ్యాలతో పాటు, ఆట పట్ల అంకితభావం, కఠిన శ్రమ, క్రమశిక్షణ కూడా ఉన్నాయని ప్రశంసించారు. భారత జట్టులో సుదీర్ఘ కాలంపాటు తన ఇన్నింగ్స్‌ కొనసాగించగలడని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు.

ఆస్ట్రేలియాలో భారత్‌ సాధించిన ఘన విజయంలో సుందర్ ప్రదర్శన సంతోషాన్నిచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అశ్విన్‌, రవీంద్ర జడేజా వంటి కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో నాలుగో టెస్టుకు దూరమయ్యారు.

ఈ  తరుణంలో వాషింగ్టన్‌కు తుది జట్టులో మేనేజ్‌మెంట్ చోటు కల్పించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ యువ స్పిన్నర్‌‌.. 4 వికెట్లు తీసి టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇదే సమయంలో సుందర్ బాల్యం గురించి ఆయన తల్లి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు. అతను రోజూ ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేచి గ్రౌండుకు, అక్కడి నుంచి స్కూలు వెళ్లేవాడు.

సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే హోం వర్క్ త్వరగా​ పూర్తి చేసి మళ్లీ ప్రాక్టీసుకు వెళ్లేవాడని ఆమె తెలిపారు. ఏదైనా కారణాల వల్ల గ్రౌండ్‌కు వెళ్లడం కుదరకపోతే ఇంట్లో రభస చేసేవాడని... వర్షం పడుతున్నా సరే ఆటను విడిచిపెట్టేవాడు కాదని క్రికెట్‌ పట్ల సుందర్‌కు ఉన్న అంకితభావం గురించి వాషింగ్టన్‌ తల్లి చెప్పారు.

అదే విధంగా సుందర్ సోదరి జ్యోతి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకోవడం మా ఇద్దరికి అలవాటని తెలిపారు. తన బౌలింగ్‌ కంటే బ్యాటింగే ఎక్కువగా ఆస్వాదిస్తానని... తనకు నేను వీరాభిమానిని అని జ్యోతి చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే