191కే కుప్పకూలిన దక్షిణాఫ్రికా: విశాఖ టెస్టులో భారత్ ఘనవిజయం

By Siva KodatiFirst Published Oct 6, 2019, 2:02 PM IST
Highlights

విశాఖ టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 203 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 191కే అలౌటయ్యారు

విశాఖ టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 203 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 191కే అలౌటయ్యారు.

ఓవర్‌నైట్ స్కోర్ 11/1తో చివరి రోజు ఆట ప్రారంభించిన సఫారీలు వరుసపెట్టి వికెట్లను చేజార్చుకున్నారు. 70 పరుగులకే  8 వికెట్లు కోల్పోయిన ఆ జట్టుకు ఓటమి దాదాపుగా ఖాయమైంది.

ముఖ్యంగా పేసర్ షమీ, స్పిన్నర్ జడేజాలు రెచ్చిపోయారు. 12వ ఓవర్‌లో తెంబ బవుమాను బౌల్డ్ చేసిన షమీ.. ఆ తర్వాత  22వ ఓవర్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లిసెస్‌ను, 24వ ఓవర్‌లో డికాక్‌ను వెంట వెంటనే ఔట్ చేసి సఫారీలను కోలుకోలేని దెబ్బతీశాడు.

ఓపెనర్  మార్కరమ్, ఫిలిండర్, మహరాజ్‌,బ్రయాన్‌ను జడేజా పెవిలియన్‌కు పంపాడు. అయితే చివరిలో దక్షిణాఫ్రికా టెయిలెండర్లు మత్తుస్వామి, పీయడ్త్‌లు మాత్రం మొండిగా ఎదురు నిలిచారు

టాప్ ఆర్డర్ చేతులెత్తేసినప్పటికీ వీరద్దరు భారత బౌలర్లను సమర్థవంతంగా  ఎదుర్కొన్నారు. వీరిద్దరూ కలిసి తొమ్మిదో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని షమి విడదీశాడు.

60వ ఓవర్ తొలి బంతికి  పీయడ్త్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో దక్షిణాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. కొద్దిసేపటి తర్వాత రబాడాను సైతం పెవిలియన్‌కు పంపిన షమీ భారత్‌కు విజయాన్నందించాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో పియడ్త్ 56, ముత్తుసామి  49 పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీ 5, జడేజా 4, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. 

click me!