విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ జర్నీ: రికార్డుల పరంపర, నాయకత్వం

Google News Follow Us

సారాంశం

విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్‌లో కీలక ఘట్టాలు, సెంచరీలు, కెప్టెన్సీ విజయాలు, విశిష్ట రికార్డులు పూర్తిగా తెలుసుకోండి.

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ అభిమానులకు ఊహించని వార్త ఇచ్చాడు. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. రోహిత్ శర్మ టెస్ట్‌కు వీడ్కోలు చెప్పిన కొద్దిరోజులకే కోహ్లీ కూడా టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటానని ప్రకటించడంతో అభిమానులు షాక్ అయ్యారు. బీసీసీఐ ఎన్ని ప్రయత్నాలు చేసినా కోహ్లీ నిర్ణయాన్ని మార్చలేకపోయింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ పెట్టిన భావోద్వేగపూరిత పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తనకు టెస్ట్ క్రికెట్ ఎంత ప్రత్యేకమో, ఈ ఫార్మాట్‌ ద్వారా ఎన్నో జ్ఞాపకాలు, అనుభవాలు ఎలా దక్కాయో తన మాటల్లో తెలియజేశాడు. తాను 14 ఏళ్ల క్రితం మొదటిసారి టెస్ట్ జెర్సీ వేసుకున్నానని, అప్పటి నుంచి తన ప్రయాణం ఊహించని మలుపులు తిరిగిందని చెప్పాడు. ఈ ఫార్మాట్ తనను కాస్తైనా మార్చిందని, ఆటగాడిగా కాదు మనిషిగా ఎదిగేలా చేసిందని పేర్కొన్నాడు.

కోహ్లీ టెస్ట్ కెరీర్ చూస్తే అది నిజంగా అద్భుతంగా ఉంటుంది. 123 టెస్టుల్లో 9,230 పరుగులు చేశాడు. వాటిలో 30 సెంచరీలు ఉన్నాయి. 2016 నుంచి 2019 మధ్య అతని ఆట మరింత పదును పట్టింది. ఆ సమయంలో 43 మ్యాచ్‌ల్లో 66.79 సగటుతో 4,208 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా 68 టెస్టుల్లో 40 విజయాలు సాధించడంతో భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా గుర్తింపు దక్కింది.

తన ప్రయాణం పట్ల సంతృప్తిగా ఉందని, టెస్ట్ క్రికెట్ తనకు నేర్పిన పాఠాలు జీవితాంతం గుర్తుండిపోతాయని కోహ్లీ పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ క్షణాలన్నింటిని తలుచుకుంటే తన ముఖంలో చిరునవ్వు మెరిసిపోతుందని, పూర్తి మనసుతో టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు చెబుతున్నానని తెలిపాడు.

Read more Articles on