
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని, ప్రస్తుత టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీలది గురు శిష్యుల బంధం. జట్టులో సీనియర్ అయిన ధోని.. తనకంటే జూనియర్ అయిన కోహ్లీని శిష్యుడిగా కంటే సొంత తమ్ముడిలా చూసుకున్నాడు. ఆన్ ఫీల్డ్ లోనే గాక ఆఫ్ ది ఫీల్డ్ లో కూడా వీళ్ల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం.. ధోని గురించి విరాట్ కోహ్లీ చేసిన ఓ ట్వీట్.. ఈ ఏడాది క్రీడల్లో అత్యధిక మందికి నచ్చిన, ఎక్కువ రిట్వీట్ లు చేసిన ట్వీట్ గా నిలిచింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే...
ఈ ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ రెండో దశలో భాగంగా అక్టోబర్ 10న ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ప్లేఆఫ్స్ లో రెండు జట్లకు ఇదే కీలక మ్యాచ్. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 172 పరుగులు చేసింది. తర్వాత ఛేదనలో సీఎస్కే.. మరో రెండు బంతులు మిగిలుండగానే విజయాన్ని ముద్దాడింది. టోర్నీతో పాటు కొంతకాలంగా బ్యాట్ కు పెద్దగా పని చెప్పని చెన్నై కెప్టెన్ ధోని.. ఆఖర్లో బ్యాటింగ్ వచ్చి 6 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అంతే.. మిగతాదంతా చరిత్రే..
అయితే ప్లే ఆఫ్స్ లో ధోని వీరవిహారం తర్వాత కోహ్లీ చేసిన ట్వీట్ ఇప్పుడు.. ఈ ఏడాది భారత్ లో క్రీడల్లో అత్యధిక మంది లైక్, రీట్వీట్ చేసిన ట్వీట్ గా నిలిచింది. ఈమేరకు ట్విట్టర్ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించింది. మ్యాచ్ ముగిశాక ట్విట్టర్ వేదికగా స్పందించిన కోహ్లీ.. ‘కింగ్ ఈజ్ బ్యాక్...’అని ట్వీట్ పెట్టాడు.
2021 జనవరి 1 నుంచి నవంబర్ 15 వరకు ట్విట్టర్ లో మొత్తం ట్వీట్లు, రిట్వీట్లు, లైక్స్ ను గణించి వీటిని లెక్కించినట్టు ట్విట్టర్ తెలిపింది.
ఇదీ చదవండి : Virat Kohli: ఈ ఏడాది ఎక్కువ మంది లైక్ చేసిన ట్వీట్ అదే.. అందులోనూ విరాట్ దే క్రేజ్..
ఇక ఈ ఏడాది క్రీడలకు సంబంధించి.. అత్యధిక మంది ట్వీట్స్ చేసిన ఈవెంట్లు ఇవే.. టోక్యో ఒలింపిక్స్ 2020, ఐపీఎల్ 2021, టీ20 వరల్డ్ కప్, పారాలింపిక్స్, యూరో 2020 లు టాప్-5 గా నిలిచాయి. క్రీడాకారులకు సంబంధించి.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ల గురించి ఎక్కువ మంది ట్వీట్ చేశారు.
ఇదిలాఉండగా.. విరాట్ కోహ్లీ-అనుష్కల గారాల పట్టి వామిక పుట్టిన తర్వాత విరాట్ చేసిన ట్వీట్ ఈ ఏడాది భారత్ లో ఎక్కువ మంది లైక్ చేసిన ట్వీట్ గా నిలిచింది. కోహ్లీకి పాప పుట్టిందని తెలియగానే దేశవ్యాప్తంగా బాలీవుడ్ ప్రముఖులు, క్రీడాకారులు, క్రికెట్ అభిమానులు, రాజకీయ నాయకులు.. ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో కోహ్లీ చేసిన ట్వీట్ కు ఏకంగా 5.4 లక్షల లైకులు వచ్చాయి. ఇదే విషయమై ట్విట్టర్ ఇండియా స్పందిస్తూ.. ‘కోహ్లీ చేసిన ఈ ట్వీట్ 2021 ఏడాదికి గాను అత్యధిక మంది యూజర్లు లైక్ కొట్టిన ట్వీట్ గా నిలిచింది..’ అని రాసుకొచ్చింది.