వచ్చే ఏడాది నుంచి ప్రతి యేడు ప్రపంచ కప్పే.. అందులో వాళ్లిద్దరూ అద్భుతాలు సృష్టిస్తారు : బీసీసీఐ చీఫ్ గంగూలీ

Published : Dec 13, 2021, 04:20 PM IST
వచ్చే ఏడాది నుంచి ప్రతి యేడు ప్రపంచ కప్పే.. అందులో వాళ్లిద్దరూ అద్భుతాలు సృష్టిస్తారు : బీసీసీఐ చీఫ్ గంగూలీ

సారాంశం

Sourav Ganguly: ‘2022 నుంచి 2031 దాకా ప్రతి యేడాది ఐసీసీ మెగా టోర్నీలున్నాయి. భారత క్రికెట్ జట్టు ఆఖరుసారి 2013లో ఐసీసీ ట్రోఫీ నెగ్గింది. అప్పట్నుంచి ప్రతి టోర్నీలో భారత్ కు చేదు అనుభవమే ఎదురవుతున్నది. ఈ నేపథ్యంలో....!

వచ్చే ఏడాది నుంచి ప్రతి యేడాది ప్రపంచ కప్పు నిర్వహించడానికి గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసింది. 2022 నుంచి 2031 దాకా ప్రతి యేడాది ఓ మెగా టోర్నీ ఉంది. ఈ నేపథ్యంలో భారత  క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే మెగా టోర్నీలలో భారత జట్టు అద్భుతాలు సృష్టించగలదని తాను నమ్ముతున్నానని, టీమిండియా త్వరలోనే ఐసీసీ ట్రోఫీని సగర్వంగా ఎత్తుకుంటుందని చెప్పాడు. 

ఒక ఇంగ్లీష్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ... ‘2022 నుంచి 2031 దాకా ప్రతి యేడాది ఐసీసీ మెగా టోర్నీలున్నాయి. భారత క్రికెట్ జట్టు అభిమానిగా అందులో పలు  టోర్నీలను  టీమిండియా గెలుస్తుందని నేను ఆశిస్తున్నాను. అన్నీ గెలుస్తారని నేను చెప్పను. ఏ జట్టు కూడా అన్నీ గెలవలేదు.భవిష్యత్తును అంచనా వేయడం చాలా కష్టం. కానీ టీమిండియాకు మంచి జట్టు ఉంది. అంతేగాక మనకు మంచి కోచ్ (రాహుల్ ద్రావిడ్) ఉన్నాడు. అంతేగాక ఇటీవలే కెప్టెన్ గా నియమితుడైన రోహిత్ శర్మ చేతిలో భారత జట్టు భవితవ్యం  భద్రంగా ఉందని నేను భావిస్తున్నాను. వాళ్లకు మనం ఆల్ ది బెస్ట్ చెబుతాం. 

క్రికెట్ ఎప్పటికైనా జట్టుగా ఆడే ఆట. జట్టు కెప్టెన్, ఆటగాళ్లు, కోచులు కలిసి వారి పనులను సమర్థవంతంగా నిర్వర్తిస్తేనే అది విజయవంతమైన జట్టు అవుతుంది. గడిచిన  ఐదేండ్లుగా టీమిండియా సక్సెస్ ఫుల్ జట్టుగా ఉంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ లో ఓటమి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. దాని గురించి మరిచిపోయి రాబోయే  రోజుల్లో టీమిండియా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందని ఆశిస్తున్నా..’ అని అన్నాడు. 

 

భారత జట్టు ఐసీసీ ట్రోఫీ నెగ్గి సుమారు తొమ్మిదేండ్లు కావస్తున్నది. 2013 లో ధోని సారథ్యంలోని భారత జట్టు చివసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది. ఆ తర్వాత ప్రతి ఐసీసీ టోర్నీకి వెళ్లడం.. ఉత్త చేతుల్తోనే తిరిగి రావడం సర్వ సాధారణమవుతున్నది.టెస్టులతో పాటు  పరిమిత ఓవర్ల క్రికెట్ లో విజయవంతమైన రికార్డు కలిగి ఉన్న కోహ్లీ కూడా విదేశాలలో సిరీస్  లు నెగ్గిన ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. ఈ కారణంగానే అతడు ఇటీవల కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. 

ఇదీ చదవండి : ICC: ఇక మీ ఓపిక.. క్రికెట్టుకు లేదిక తీరిక.. పదేండ్ల దాకా పండుగే.. ఏడాదికో మెగా టోర్నీ.. ఇండియాలో ఎన్నంటే..?

ఇక 2014 లో టీ20 ప్రపంచకప్  ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిన టీమిండియా.. 2015 వన్డే ప్రపంచకప్ లో ఆసీస్ చేతిలో సెమీస్ లోనే నిష్క్రమించింది. 2016లో టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో వెస్టిండీస్ భారత్ ను ఓడించగా.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్..  ఇండియాపై గెలిచింది. 2019 వన్డే ప్రపంచకప్ లో న్యూజిలాండ్.. మనను సెమీస్ గడప దాటనీయలేదు. ఇక 2021 లో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో కూడా న్యూజిలాండ్ చేతిలోనే భారత్ ఫైనల్లో ఓడింది. 2021లో జరిగిన టీ20 ప్రపంచకప్ లో సెమీస్ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !