
సిరీస్ విజేతను నిర్ణయించే కీలక టెస్టులో భారత్ ను విజయతీరాలకు చేర్చేందుకు ఒకవైపు టీమిండియా బౌలర్లు కృషి చేస్తుంటే మరోవైపు ఫీల్డర్లు మాత్రం వరుస తప్పిదాలు చేశారు. క్యాచ్ డ్రాప్ లు, మిస్ ఫీల్డింగులతో భారీ మూల్యం చెల్లించారు. స్లిప్స్ లో ఉన్న కెఎల్ రాహుల్, పుజారాలు క్యాచులు మిస్ చేస్తే.. ఫీల్డింగ్ లో మయాంక్ అగర్వాల్ తో పాటు ఇతర ఫీల్లర్లు కూడా బద్దకంగా కనిపించారు. దీంతో భారత సారథి విరాట్ కోహ్లి ఫీల్డర్లపై అసహనం వ్యక్తం చేశాడు.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్సులో భాగంగా 34 ఓవర్లో బుమ్రా.. పీటర్సన్ కు బౌలింగ్ చేస్తుండగా ఫీల్డింగ్ చేస్తున్న మయాంక్ అగర్వాల్.. బంతి బౌండరీకి చేరకుండా సులువుగా ఆపే పరిస్థితి ఉన్నా విఫలమయ్యాడు. బాల్ ను బౌండరీ లైన్ ముందే అందుకున్నా.. అతడి కాలు మాత్రం బౌండరీ రోప్ కు తాకింది. బ్యాటర్ కు నాలుగు పరుగులు లభించాయి. ఇది చూసిన కోహ్లి మయాంక్ ఫీల్డింగ్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదే విషయమై కామెంటరీ బాక్స్ లో ఉన్న సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. ‘మయాంక్ ఈజీగా బంతిని వెనక్కి నెట్టవచ్చు. కానీ అలా జరుగులేదు. కోహ్లి అలా అసహనానికి గురికావడంలో ఎంత మాత్రమూ ఆశ్చర్యం లేదు..’ అని అభిప్రాయపడ్డాడు.
ఇక.. 49.4 ఓవర్లో శార్దూల్ ఠాకూర్ వేసిన ఓవర్లో భారత్ కు ఐదు పెనాల్టీ పరుగుల శిక్ష పడింది. శార్దూల్ వేసిన బంతిని బవుమా ఆడగా.. అది కాస్త ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. దానిని అందుకునేందుకు పుజారా ప్రయత్నించగా.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా దానికోసమే ముందుకు దూకాడు. కానీ ఇద్దరూ కలిసి క్యాచ్ మిస్ చేశారు. ఇంతలో పుజారా చేతికి తాకిన బంతి.. పంత్ వెనుక ఉన్న హెల్మెట్ కు తాకింది. దీంతో నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికాకు అంపైర్ 5 పరుగులు అదనంగా ఇచ్చాడు. ఇది కూడా కోహ్లికి అసహనం తెప్పించింది.
ఈ రెండు ఘటనలే గాక స్లిప్స్ లో ఉన్న కెఎల్ రాహుల్ కూడా రెండు క్యాచులు మిస్ చేశాడు. అందులో ఒకదాన్ని అందుకోవడం కష్టం కాగా మరొకటి చేతిలోకి వచ్చినదానిని కూడా అందుకోలేదు. ఫ్రంట్ ఫీల్డర్లు రెండు రనౌట్లను మిస్ చేశారు. దీంతో కోహ్లి అసహనం పీక్స్ కు వెళ్లింది.