Virat Kohli: మరింత దిగజారిన కోహ్లి.. ఆరేండ్లలో తొలిసారి..

Published : Jul 06, 2022, 05:31 PM IST
Virat Kohli: మరింత దిగజారిన కోహ్లి.. ఆరేండ్లలో తొలిసారి..

సారాంశం

ICC Test Rankings: పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో సైతం విఫలమైన కోహ్లి.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో దారుణంగా పడిపోయాడు. టాప్-10 నుంచి నిష్క్రమించాడు.   

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.. ‘ఆ కిందకు దిగడమనేది  చాలా రోజుల పాటు కంటిన్యూ  అయింది. ముందు లిఫ్ట్ దిగాను. తర్వాత ఎయిర్ పోర్టులో కార్ దిగాను. ఇండియాలో ప్లేన్ దిగాను. మా నాన్న బాడీ అంబులెన్స్ లోంచి దిగింది. మా కంపెనీ షేర్లు కిందికి దిగాయి..’ అని..  ప్రస్తుతం టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి కూడా  ఇదే ‘దిగుడు’ సూత్రాన్ని పాటిస్తున్నట్లున్నాడు. ‘ఇంతింతై వటుడింతై’ అన్న మాదిరిగా అంతర్జాతీయ క్రికెట్ లో ఓ వెలుగు వెలిగిన విరాట్ కోహ్లి ప్రభ నెమ్మదిగా మసకబారుతున్నది. ఫామ్ కోల్పోయి సుమారు గత మూడేండ్లలో ఒక్క సెంచరీ కూడా చేయని విరాట్.. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో దారుణంగా పడిపోయాడు. అతడు టాప్-10 నుంచి నిష్క్రమించాడు.

పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో సైతం విఫలమైన కోహ్లి.. ఐసీసీ టెస్టు ర్యాంకుల జాబితాలో 13వ స్థానానికి దిగజారాడు. గడిచిన ఆరేండ్లలో అతడు టాప్-10 నుంచి నిష్క్రమించడం ఇదే ప్రథమం. 2016 నవంబర్ నుంచి కోహ్లి టాప్-10 లో భాగమయ్యాడు. ఈ జాబితాలో అతడు ఏకంగా 2,053 రోజులున్నాడు. 

 

కాగా ఈ జాబితాలో ఇంగ్లాండ్ మాజీ సారథి జో రూట్ (923 పాయింట్లు) అగ్రస్థానాన నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో మార్నస్ లబూషేన్ (ఆస్ట్రేలియా - 879 పాయింట్లు), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా - 826), బాబర్ ఆజమ్ (పాకిస్తాన్ - 815) నిలిచారు. 

 

ఇక ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో సెంచరీ (146), హాఫ్ సెంచరీ (57) తో ఆకట్టుకున్న టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఈ జాబితాలో  ఐదు స్థానాలు ఎగబాకి 801 పాయింట్లతో  5వ స్థానంలో నిలిచాడు. టాప్-10లో భారత సారథి రోహిత్ శర్మ ఒకస్థానం దిగజారి తొమ్మిదో ర్యాంకుకు పడిపోయాడు. వరుసగా న్యూజిలాండ్ తో పాటు ఇండియాతో టెస్టులో కూడా రాణించిన జానీ బెయిర్ స్టో పదో స్థానంలో నిలిచాడు. 

బౌలర్లలో ఆసీస్  టెస్టు సారథి  పాట్ కమిన్స్ 900 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అశ్విన్ (842 పాయింట్లు)  రెండో స్థానంలో నిలవగా మిగిలిన భారత బౌలర్లెవరూ టాప్-10లో లేరు. ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (384), అశ్విన్ (335) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !