స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డు బ్రేక్ - అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకేఒక్క‌డు విరాట్ కోహ్లీ స‌రికొత్త రికార్డు

By Mahesh RajamoniFirst Published Oct 1, 2024, 10:57 AM IST
Highlights

Virat Kohli Shatters Sachin Tendulkar's Record : అంత‌ర్జాతీయ క్రికెట్ లో ర‌న్ మిష‌న్ విరాట్ కోహ్లీ రికార్డుల మోత కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే దిగ్గ‌జ ప్లేయ‌ర్లు స‌చిన్ టెండూల్క‌ర్, కుమార సంగ‌క్క‌ర‌, రికీ పాంటింగ్ ల రికార్డును బ్రేక్ చేస్తూ మ‌రో కొత్త రికార్డును న‌మోదుచేశాడు కింగ్ కోహ్లీ. 
 

Virat Kohli Shatters Sachin Tendulkar's Record : రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో అద్భుత ఘనతను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 27,000 పరుగులు పూర్తి చేసాడు. క్రికెట్ లో ఈ ఘనత ఇప్పటికి కేవలం నలుగురు క్రికెట‌ర్లు మాత్ర‌మే సాధించారు. అయితే, ఈ మార్కును అత్యంత వేగంగా చేరుకున్న కోహ్లీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న 2వ టెస్టులో 4వ రోజు కింగ్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు.

 

అంత‌ర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగంగా 27 వేల ప‌రుగులు 

Latest Videos

 

కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో 4వ రోజులో అత్యంత వేగంగా 27000 అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాడిగా భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన కెరీర్‌లో మరో రికార్డును సాధించాడు. కింగ్ కోహ్లీ కేవలం 594 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్‌ను సాధించాడు. దీంతో భారత లెజెండ‌రీ  బ్యాటర్ సచిన్ టెండూల్కర్ (623 ఇన్నింగ్స్‌లు) రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. 600 కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో 27000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన ఏకైక క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. 

 

27000 అంతర్జాతీయ పరుగులకు అత్యంత వేగంగా సాధించింది వీరే

 

 

594 ఇన్నింగ్స్‌లు - విరాట్ కోహ్లీ

623 ఇన్నింగ్స్‌లు - సచిన్ టెండూల్కర్

648 ఇన్నింగ్స్‌లు - కుమార సంగక్కర

650 ఇన్నింగ్స్‌లు - రికీ పాంటింగ్

 

మొత్తంగా విరాట్ కోహ్లీ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్ల‌లో నాల్గవ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ కంటే ముందు భార‌త క్రికెట్ దిగ్గజం టెండూల్కర్ (34,357), శ్రీలంక మాజీ స్టార్ కుమార సంగక్కర (28,016), ఆస్ట్రేలియా లెజెండ‌రీ ప్లేయ‌ర్ రికీ పాంటింగ్ (27,483)లు టాప్ లో ఉన్నారు. ఈ జాబితాలో అత్య‌ధిక సెంచ‌రీలు సాధించిన ప్లేయ‌ర్ గా స‌చిన్ టాప్ లో ఉన్నాడు. ఆ త‌ర్వాత విరాట్ కోహ్లీ ఉన్నాడు. టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 100 సెంచరీలు సాధించాడు. త‌ర్వాత విరాట్ కోహ్లీ 80 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. 

 

వైట్-బాల్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన రికార్డులు 

 

వైట్-బాల్ క్రికెట్‌లో కోహ్లీకి అద్భుత రికార్డులు క‌లిగి ఉన్నాడు. వన్డేల్లో 14,000 పరుగులు చేసిన మూడో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీ స‌చిన్ టెండూల్కర్ (18,426), సంగక్కర (14,234) తర్వాతి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 295 వన్డేల్లో 58.18 సగటుతో 13,906 పరుగులు చేశాడు. వన్డేల్లో 50 శతకాలు సాధించిన ఏకైక ఆటగాడిగా కింగ్ కోహ్లీ నిలిచాడు. ఇక టీ20 క్రికెట్ లో కూడా కోహ్లీ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. ఐసీసీ టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో భార‌త్ ఛాంపియ‌న్ గా నిలిచిన త‌ర్వాత కింగ్ కోహ్లీ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. అయితే, టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స‌మ‌యంలో విరాట్ కోహ్లీ 4,000+ పరుగులు (4,188) సాధించిన ముగ్గురు ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నారు. అలాగే, టీ20 ఫార్మాట్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ప్లేయ‌ర్ గా కూడా ఉన్నాడు. 

 

టెస్టుల్లో 8,900కు పైగా పరుగులు

 

 

విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌లో 8,900కు పైగా ప‌రుగులు చేశాడు. ప‌దివేల ప‌రుగుల‌కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న హోమ్ సీజన్‌లో కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగులు చేసిన నాల్గవ భారత క్రికెట‌ర్ గా ఘ‌న‌త సాధించే ఛాన్స్ ఉంది. ఇక భారత్ నుంచి ఇప్పటివరకు అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ల లిస్టులో దిగ్గ‌జ ప్లేయ‌ర్లు స‌చిన్ టెండూల్క‌ర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,288), సునీల్ గవాస్కర్ (10,122) టాప్ లో ఉన్నాడు. ఇక సెంచ‌రీల విష‌యంలో కూడా కోహ్లీ మ‌రో రికార్డుకు ద‌గ్గ‌ర‌గా ఉన్నాడు. టెస్టు క్రికెట్ లో విరాట్ కోహ్లీ 29 సెంచ‌రీలు సాధించాడు. మ‌రో ఒక సెంచ‌రీ కొడితే ఈ ఫార్మాట్‌లో 30 సెంచరీల మార్క్‌ను అందుకుంటాడు.

కాగా, జైస్వాల్ 72 పరుగులు, రోహిత్ శర్మ 23 పరుగులు, గిల్ 39 పరుగులు చేశారు. రన్ మిషన్ విరాట్ కోహ్లీ (47 పరుగులు) మూడు పరుగల దూరంలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. కేఎల్ రాహుల్ 68 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్  91/4 (27.2) పరుగులతో రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. ఈ టెస్టు మ్యాచ్ లో వర్షం కారణంగా మొదటి రోజూ ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం అయింది. రెండో రోజు వర్షం కారణంగా ఆ రోజు ఆటను రద్దు చేశారు. ఇక మూడో రోజు వర్షం లేకపోయినా వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఆటను కొనసాగించడానికి పిచ్ అనుకూలించకపోవడంతో ఆ రోజు ఆటను కూడా రద్దు చేశాడు. నాల్గో రోజు బంగ్లాదేశ్ 233-10 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. భారత తొలి ఇన్నింగ్స్ ను 285-9 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ ను ఆడుతోంది.

click me!